ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎన్డీయే కూటమి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం మొదటి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది.  ఇందులో గత ప్రభుత్వానికి సంబంధించిన పలు శాఖలపై సీఎం చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు.  ఇప్పటికే శాంతి భద్రతలు, పోలవరంపై వైట్ పేపర్ రిలీజ్ చేసిన ఆయన.. తాజాగా ఆర్థికపరిస్థితిపై మరో శ్వేత పత్రం విడుదల చేశారు.

అయితే రాజకీయాల్లో 40 ఏళ్ల ఇండస్ర్టీ, 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని పదేపదే చంద్రబాబు చెప్పుకోవడం మనం చాలా సార్లు చూశాం. సంపద సృష్టించడం తనకు మాత్రమే తెలుసని గొప్పగా ప్రచారం కూడా చేసుకున్నారు. అయితే ఏపీలో నిజమైన సంపద సృష్టి ఎవరి హయాంలో జరిగింది అనేది ఓసారి పరిశీలిస్తే..

నిజంగా చంద్రబాబు సంపద సృష్టించగలిగితే 2014లో ఇచ్చిన హామీలను అమలు చేసేవారు. కానీ ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారు. తాజాగా విడుదల చేసిన ఆర్థిక శ్వేత పత్రంపై బుగ్గన పలు కీలక అంశాలను వెల్లడించారు. 2014-19 నాటికి మధ్య కాలంలో రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే.. తమ హయాంలో ఆ పెరుగుదల 12శాతమేనని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే.. టీడీపీ గద్దె దిగే నాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరిందన్నారు. తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు 5.18 లక్షల కోట్లు అని.. అంటే పెరుగుదల 12.9 శాతమని తెలిపారు.

సంపద సృష్టిలో స్పెషలిస్టులమని చంద్రబాబు చెప్పుకుంటారని.. కానీ అది పూర్తిగా అవాస్తవం అన్నారు. 2014-15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు కాగా, 2019లో ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ మొత్తం రూ.1,14,671 కోట్లు మాత్రమే అన్నారు. ఆదాయం ఏటా 6.09 శాతం పెరిగిందన్నారు. అదే తమ ప్రభుత్వ హయాంలో ఏటా 16.7శాతం పెరిగిందన్న ఆయన.. ఈ గణాంకాలు చెప్పారు. 2019-20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు, కాగా 2023-24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: