గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు మద్యం పాలసీపై తీవ్ర విమర్శలు చేశారు. వీటినే ప్రచార అస్త్రాలుగా మలచుకొని అన్ని సభల్లో హోరెత్తించారు. ప్రధానంగా బ్రాండెడ్ మద్యం  అందుబాటులోకి లేదనే విమర్శలకు తోడు, కనీ వినీ ఎరుగని బ్రాండ్లు ఏపీలో హల్ చల్ చేశాయి. తాను అధికారంలోకి వస్తే తర్వాత బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం ఇందులో కొసమెరుపు.


అయితే మద్యం పాలసీ కూడా వైసీపీ ఎన్నికల్లో దారుణ ఓటమికి ప్రధాన కారణం అని పలు విశ్లేషణలు సైతం వచ్చాయి. తాజాగా ఏపీలో ఎక్సైజ్ శాఖపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. దీంతో ఈ వైట్ పేపర్ సరికొత్త చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. దేశమంతా దొరికే లిక్కర్ ఏపీలో దొరక్కపోవడానికి కారణం ఐదు రకాల బ్రాండ్ల కంపెనీలను తరిమేయడమే అన్నారు.


గత ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందని ఈ వ్యవహారంపై కచ్చితంగా విచారణ జరిపిస్తామని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. అనంతరం ఏపీ సీఐడీకీ ఈ బాధ్యతను అప్పజెప్పారు. మరీ లోతైన దర్యాప్తు అవసరం అయితే ఎన్ ఫోర్స్ మెంట్ డెరెక్టరేట్ కి అప్పగించే యోచనలో ఉన్నట్లు హింట్ ఇచ్చారు.


అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. గత ఐదేళ్లలో రూ.లక్షల కోట్లలో మద్యం విక్రయాలు జరిగాయని.. ఇందులో రూ.లక్షల కోట్లలో అవినీతి జరిగిందని ఎన్నికల ముందు ఆరోపించారు.  కానీ ప్రస్తుతం విడుదల చేసిన శ్వేతపత్రంలో రూ.19 వేల కోట్ల వరకు ప్రాధమికంగా తేలిందని చెప్పారు. మీరు చెప్పిన విధంగా రూ.లక్ష కోట్ల అవినీతి ని బయట పెట్టాలని వైసీపీ నేతలు కోరుతున్నారు. పైగా తమ హయాంలోనే మద్యం విక్రయాలు తగ్గాయని చెబుతున్నారు. అయితే త్వరలోనే సమగ్రంగా విచారణ జరిపించి మొత్తం అక్రమాలు బయట పెడతామని టీడీపీ అధినేత ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: