ఏటా ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో కలసి నీతి ఆయోగ్ సమావేశాన్ని నిర్వహిస్తారు. వీరితో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల గవరన్లర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వాదనను వింటారు. వారి డిమాండ్లు పరిష్కరిస్తారు. ఈ సారి నీతి ఆయోగ్ సమావేశం వికసిత్ భారత్ -2047 ఎజెండాగా సాగింది. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ని తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. వివిధ అభివృద్ధి అంశాలు, విధానపరమైన ఎజెండాలు గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
గతంలో ప్రణాళిక సంఘం ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాలు వంద రూపాయలను పన్ను రూపంలో చెల్లిస్తే తిరిగి వారికి రూ.32 చెల్లించేవారు. ఆ తర్వాత ప్రధాని నీతి ఆయోగను తీసుకువచ్చి రాష్ట్రాలకు ఇచ్చే ఈ మొత్తాన్ని రూ.42కి పెంచారు. అక్కడి రాష్ట్రాల్లో ప్రభుత్వాలతో కేంద్రానికి పని లేదు. అందర్నీ సమాన దృష్టితో చూశారు. దీంతో పాటు అనేక సంస్కరణలు తీసుకువచ్చారు.
సత్ఫలితాలు ఇస్తున్న నీతి ఆయోగ్ పై ప్రతిపక్షాలు బురద చల్లడం ప్రారంభించాయి. ప్రస్తుతం జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి ఏకంగా ఎనిమిది రాష్ట్రాల సీఎంలు గైర్హాజరు అవడం చర్చనీయాంశం అయింది. కనీసం వారి తరఫున అధికారులను కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపలేదు. దీంతో ఈ పరిణామం మోదీ సర్కారుకు అవమానకరమేనని జాతీయ మీడియా చెబుతోంది. మరోవైపు ఈ సమావేశానికి హాజరైన సీఎం మమతా బెనర్జీ తనకు మైక్ ఇవ్వలేదని ఆరోపిస్తూ సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. అంతేకాదు నీతి ఆయోగ్ను రద్దు చేసి ప్రణాళిక సంఘాన్ని తీసుకురావాలని సంచలన ప్రకటన చేశారు.