ఎన్నికల సమయంలో డొక్కా సీతమ్మ పేరుతో క్యాంటీన్లు పెట్టి నిరుపేదల కడుపు నింపుతానని జనసేనాని ప్రకటించారు. కానీ టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో అన్నా క్యాంటన్లలో కొన్నింటికి అయినా దాత డొక్కా సీతమ్మ పేరు పెట్టాలని కోరారు. అయితే గతంలో అన్నా క్యాంటీన్లను ఎన్టీఆర్ పేరుతో టీడీపీ నడపింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ సూచనల మేరకు కొన్నింటికి డొక్కా సీతమ్మ పేరు పెడతారా అలసు ఈ పేర్ల తకరారు రెండు పార్టీల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుందా అని పలువురు అనుకున్నారు.
అయితే ఆగస్టు 15 నుంచి ప్రారంభించే క్యాంటీన్లకు పేరు ఖరారు విషయంలో ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. ఈ సందర్భంగా 2019 వరకు ఉన్న అన్నా క్యాంటీన్ల పేరునే కొనసాగించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని తెచ్చిన అన్న గారి పేరుతో పేదలకు పట్టెడన్నం పెట్టడం మంచి ఆలోచన అన్నారు.
విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పరధిలోని మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ అని పేరు పెట్టారు. దీనిపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. చదువుకునే విద్యార్థులు ఉందే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ఆమె పేరు పెట్టడం మరింత సబబు అన్నారు. వారే రేపటి భావి భారత పౌరులు అన్నారు. వారికి సీతమ్మ లాంటి ప్రముఖులు గురించి వారి దాన వితరణ గురించి తెలుసుకొని స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి అన్నా క్యాంటీన్ల పేరును పవన్ ప్రతిపాదిస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.