ఏపీ మంత్రి వర్గం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల హామీల అమలుకు ప్రాధాన్యం ఇస్తూ.. పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ముఖ్యంగా వైసీపీ హయాంలో జరిగిన వివిధ ప్రభుత్వ పాలసీలపై దృష్టి పెట్టింది. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి గురించి చర్చించింది. అదే సమయంలో కొత్త మద్యం పాలసీపై ప్రకటనకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


అయితే ఇందులో ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో కీలకమైన ఇద్దరు పిల్లలు వ్యవహారాన్ని చంద్రబాబు సర్కారు తోసిపుచ్చింది. వాస్తవానికి ఇది రాజ్యాంగ విరుద్ధ నిబంధన. దీనిని మార్పు చేసేందుకు చట్ట సవరణ చేయాలి. అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించుకొని, మండలికి పంపి.. అక్కడ కూడా ఓకే చేయించుకున్నాక రాష్ట్రపతికి పంపించాలి. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.


ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన 1970లో తీసుకువచ్చారు. ఇది దేశ వ్యాప్తంగా అమలు అవుతుంది. బిహార్, యూపీలో అయితే మరింత కఠినంగా ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారు. కర్ణాటక, తమిళనాడులో ఈ చట్టాలను మార్పు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఏపీ వచ్చి  చేరింది.


దీంతో పాటు పలు నిర్ణయాలను తీసుకుంది. జగన్ ఫోటోలతో రాళ్లు.. భూములు సర్వే తదితర అంశాలపై చర్చించారు. వాటి స్థానంలో ప్రభుత్వ ముద్రతో పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. పాత ఎక్సైజ్ పాలసీని పక్కన పెట్టి.. కొత్త పాలసీని రూపొందించేందుకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. మత్స్యకారుల జీవన విధానానికి విఘాతం కలిగిస్తూ.. గత ప్రభుత్వం జారీ చేసిన 217 జీవోను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో చేపల వేటకు సంబంధించి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవోను మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. మంత్రి వర్గం తీసుకున్న పలు నిర్ణయాలపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: