హైదరాబాద్ లో ప్రభుత్వ భూములు, చెరువుల రక్షణకు ఏర్పాటైన వ్యవస్థ హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా).. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టుస్తుందని అంటున్నారు. కూల్చివేతల సమాచారాన్ని ఏమాత్రం బయటకు రాకుండా అనుకున్నది అనుకున్నట్లు చక్కబెట్టేస్తుంది. అక్రమ నిర్మాణాలపై విరుచుకుపడుతోంది.
ఏపీలోని చెరువులను కాపాడాలని చంద్రబాబు సైతం ఇదే తరహా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చేందుకు వ్యూహాలు రూపొందిస్తున్న చంద్రబాబు అన్ని చెరువులను నీటితో నింపాలని జలవనరుల శాఖకు దిశా నిర్దేశం చేశారు. తదనుగుణంగా తాజాగా ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ చిన్ననీటి వనరుల విభాగం అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రభుత్వ లక్ష్యాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను బేరీజే వేసుకొని ఏం చేస్తే అన్ని చెరువులు నింపొచ్చు.. తద్వారా సాగు నీటిని, తాగునీటిని అందుబాటులోకి తేవచ్చొని అధికారులతో చర్చించారు. అక్కడ వ్యక్తం అయిన ఆలోచనల మేరకు.. అన్ని జిల్లాల్లోని మంచి నీటి చెరువులను సమీపంలోని నదులు, రిజర్వాయర్ల జలాలతో నింపేందుకు సమగ్ర కార్యచరణ రూపొందిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 38445 చిన్న చెరువులు ఉండగా.. వీటిలో నీటి నిల్వ సామర్థ్యం 206.22 టీఎంసీలు. ఈ చెరువులు కింద సాగయ్యే ఆయకట్టు 25.60 లక్షల ఎకరాలు. ఈ ఏడాది ఆగస్టు ముగియవచ్చినా.. చెరువులన్నీ పూర్తిగా నిండలేదు. వీటిలో 76.74 టీఎంసీల నీళ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.
మొత్తం నీటి నిల్వ సామర్థ్యంలో ఇది 37.12 శాతం మాత్రమే. ఈ పరిస్థితుల్లో చెరువులన్నీ నింపగలిగితే.. వాటి పరిధిలోని ఆయకట్టు సాగుకు ఢోకా ఉండదని, సమీపంలోని భూగర్భ జలాలు పెరుగుతాయని పచ్చదనం విస్తరిస్తుందని ప్రభుత్వం యోచిస్తోంది. చెరువులు నింపేందుకు అధికారులు మార్గాలను ప్రతిపాదిస్తున్నారు.
రాష్ట్రంలో 108 భారీ, మధ్య తరహా ప్రాజెక్టులుండగా, వీటి నుంచి సాగు, తాగు నీటి సరఫరాకు ప్రత్యేకంగా కాలువల వ్యవస్థ ఉంది. ఈ కాలువల నుంచే నీటిని మళ్లించి సమీప చెరువులు నింపాలన్నది ప్రణాళిక. అవసరాన్ని బట్టి భూసేకరణ చేయడం.. నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.