తెలంగాణ టీడీపీ లో సమీకరణాలు మారుతున్నాయి. పార్టీలో చేరికలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మాజీ మంత్రి బాబూ మోహన్ చేరికకు రంగం సిద్ధమైంది. ఏకంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు పసుపు రంగు చొక్కా ధరించి వచ్చిన ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. త్వరలో ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది. మరోవైపు రాజకీయ ఊగిసలాటలో ఉన్న ఓ ఎమ్మెల్యే సైతం టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం.
చాలా మంది ఇతర పార్టీ నాయకులు సైతం తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో తెలంగాణలో పార్టీని నడిపించేందుకు సరైన నాయకుడు అవసరం. గత కొద్ది రోజులుగా టీడీపీ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. అయితే బీసీలకు ఆ పదవి అప్పజెప్పి పార్టీని బతికించాలనేది చంద్రబాబు వ్యూహంగా తెలుస్తోంది. అగతంలో కాసాని జ్ఙానేశ్వర్ కి అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు చంద్రబాబు.
ఆయన కూడా చురుగ్గానే పనిచేశారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ దూరం కావడంతో కాసాని అలిగారు. బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీ తరఫున చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డారు. కానీ గెలవలేకపోయారు. ప్రస్తుతం ఆయన కేసీఆర్ పార్టీతో అంటీ ముట్టన్నట్లు ఉంటున్నారు. చంద్రబాబు పిలిస్తే మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు ఆయన సుముఖంగా ఉన్నట్లు సమాచారం. త్వరలో కాసాని జ్ఙానేశ్వర్ ని పార్టీలోకి రప్పించి పగ్గాలు అప్పగిస్తారు అనే ప్రచారం నడుస్తోంది.
తాజాగా తెలంగాణ పార్టీ శ్రేణులతో చంద్రబాబు భేటీ అయ్యారు. వారికి దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ టీడీపీలో అన్ని కమిటీలను రద్దు చేశారు. త్వరలో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీల ఎంపిక చేస్తామని ప్రకటించారు. తెలంగాణలో టీడీపీ క్యాడర్ చెక్కు చెదరలేదని.. కానీ నడిపించే నాయకత్వం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బలమైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా బలమైన.. బీసీ సామాజిక వర్గానికి చెందిన కాసాని వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.