ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి అయిదేళ్లకు ఓ సారి వారి ఆలోచనల్లో మార్పు వస్తుందనే ప్రచారం సాగుతూ ఉంటుంది. అంతే కాదు ఉద్యోగులతో ఎవరు పెట్టుకున్నా వారు ఇబ్బందులు పడతారు అని కూడా అంటుంటారు. వైసీపీ ప్రభుత్వ విధానాలతో విసిగిన ఉద్యోగులు అంతా టీడీపీ కూటమికే మద్దతు ఇచ్చారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట.
ఏది ఏమైనా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యం చూసినప్పుడు ఉద్యోగ వర్గాలు ఫుల్ హ్యాపీ మూడ్ లో ఉన్నట్లు కనపించింది. కానీ రానురాను ఉద్యోగులు భయపడుతున్నారు అనే చర్చ మొదలైంది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను బయటకు తీసే క్రమంలో తొలి దెబ్బ ఉద్యోగులపైనే పడుతుంది అన్న ఆవేదన కూడా వారిలో దాగుందని అంటున్నారు. సాధారణంగా ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రభుత్వం చెప్పినట్లే చేస్తారు. అందులో తప్పొప్పులకు బాధ్యత ఎక్కువగా రాజకీయ నేతలకే ఉంటుంది.
అయితే వారు ఓడినా పెద్దగా ఇబ్బంది ఉండదు. వారు తప్పించుకునే వీలు ఉంటుంది. కాకపోతే ఉద్యోగులే దొరికిపోతుంటారు. ఇప్పుడు వైసీపీ వర్సెస్ కూటమి సాగుతున్న పొలిటికల్ వార్ లో ఉద్యోగులు నలిగిపోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు ఎక్కడా ఉన్న పనిచేయాల్సిందే. తప్పించుకోవడానికి లేదు. ఇటీవల కొంత కాలంగా ఫైళ్లు దహనం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చర్యలు ఉద్యోగులు మీదే ఉంటాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఇక తాజాగా ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగులంతా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. అసలు ఉద్దేశ పూర్వకంగా ఏ ఉద్యోగి ఫైల్స్ తగలపెట్టరని అన్నారు. మదనపల్లి కేసు కోర్టు పరిధిలో ఉందని.. దాని గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. అయినా ఉద్యోగులే దోషులు అన్నట్లు చిత్రీకరిస్తున్నట్లు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద బొప్పరాజు కామెంట్లు చూస్తే రెవెన్యూ ఉద్యోగుల్లో ఆవేదన ఉన్నట్లు అర్థం అవుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి.