ఏపీలో ప్రతిష్ఠాత్మకంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. వాటిని ఆగస్టు 15 నుంచి ప్రారంభించింది. ఈ క్యాంటీన్లకు సామాన్య ప్రజలు పోటెత్తుతున్నారు. రూ.15 లకే మూడు పూటలా ఆహారం లభిస్తుండటంతో భారీగా ఆసక్తి చూపుతున్నారు. ఇదే సందర్భంలో శుచీ శుభ్రతకు పెద్ద పీట వేస్తుండటంతో ప్రజలు అన్న క్యాంటీన్లో తినేందుకు మొగ్గు చూపుతున్నారు.
చిరు వ్యాపారులు, ఆటో కార్మికులు, నిరుద్యోగ యువత ఎక్కువగా క్యాంటీన్లకు ఎక్కువగా వస్తున్నారు. గత కొద్ది రోజులుగా వీటిని ప్రజా ప్రతినిధులు సందర్శిస్తున్నారు. స్వయంగా భోజనాలు వడ్డిస్తున్నారు. అయితే తాజాగా కృష్ణా జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులు అన్న క్యాంటీన్ కు వెళ్లి ఆహారం తినడం ఆసక్తికరంగా మారింది. సోమవారం మధ్యాహ్నం కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, భార్య, కుమార్తెతో కలిసి మచిలీపట్నం అన్న క్యాంటీన్ ను సందర్శించారు. స్వయంగా మూడు టోకెన్లు తీసుకున్నారు.
క్యూలో నిల్చొని భోజనం చేశారు. అయితే ఇంత వరకు కలెక్టర్లు అన్న క్యాంటీన్లో భోజనం చేసింది లేదు. నాయకులు మాత్రం తరచుగా వెళ్లి వస్తుండటం వంటివి చేస్తున్నారు . దీంతో కృష్ణాజిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా నిలిచారు. సామాన్యుల మాదిరిగా క్యాంటీన్లో భోజనం చేయడం పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
సాధారణంగా రాజకీయ నాయకులు ఇటువంటి చోట్ల సందడి చేస్తుంటారు. రాజకీయంగా ప్రజల మద్దతు కోసం, ప్రచారం కోసం అలా చేస్తుంటారు. కానీ జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులతో స్వయంగా అన్నా క్యాంటీన్ కి వచ్చి భోజనం చేయడం మాత్రం అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఈ సందర్భంగా ఆయన అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడారు. క్యాంటీన్ నిర్వాహకులతో మాట్లాడి మెరుగైన, నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు.
అయితే కలెక్టర్ అన్న క్యాంటీన్ లో భోజనం చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రచారం చంద్రబాబు వరకు వెళ్లింది. దీంతో ఆయన వెంటనే స్పందింది.. కలెక్టర్ బాలాజీకి ఫోన్ చేసి అభినందించారు. కలెక్టర్లు తరచూ క్యాంటీన్లకు వెళ్లడం వల్ల అక్కడి సమస్యలు తెలుస్తాయని అభిప్రాయపడ్డారు.