ఎట్టకేలకు పోలవరానికి భారీ వరం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ.12500 కోట్లు పెండింగ్ నిధులను విడుదలచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొని ఆమోద ముద్ర వేసింది.
దీంతో మొత్తం పోలవరం ప్రాజెక్టు చుట్టూ అల్లుకున్న ఆటంకాలు మేఘాలు తొలిగిపోయాయని అంటున్నారు. పోలవరం విషయంలో గత పదేళ్లుగా ఏపీ ప్రజానీకం ఆశగా ఎదురు చూస్తోంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు కొంత వరకు సాగాయి. అయితే కేంద్రం సాయం మాత్రం ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకి ఆశించిన స్థాయిలో లేదు అన్న మాట మాత్రం ఉంది. పోలవరం విషయంలో ఆనాడు చంద్రబాబు తర్వాత జగన్ కూడా తమ విన్నపాలను కేంద్రానికి చేస్తూనే ఉన్నారు. కానీ నాడు ఫలించలేదు. కాని ఇప్పుడు పోలవరం కల సాకారం అయ్యేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనికి కారణం కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజార్టీ లేదు.
ఏపీలోని టీడీపీ ఎంపీల మద్దుత అవసరం ఏర్పడుతోంది. దాంతోనే మోదీనే చంద్రబాబు ఒప్పిస్తున్నారు మోదీ కూడా ఏపీ పట్ల గతానికి భిన్నంగా స్పందిస్తున్నారు అన్న భావన వ్యక్తం అవుతుంది.
నిజానికి పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉంది. కానీ ఆ జాతీయ ప్రాజెక్టు ని ఏపీ చేతుల్లోకి తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తే దానికి రీయింబర్స్ మెంట్ ఇవ్వడానికి కేంద్రం మొగ్గు చూపింది. అది కూడా కేంద్రానికి వీలు అయినప్పుడు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. మరో వైపు పెట్టిన ఖర్చు కూడా వెనక్కి రాకుండా పెండింగ్ లోనే ఉండిపోతుంది.
కానీ దీని మీద ఇప్పుడు కదలిక బాగానే వచ్చింది. మరోవైపు చూస్తే పోలవరం విషయంలో 2014-19 వరకు పనులు బాగానే సాగాయి. కానీ కేంద్రంతో టీడీపీ తెగతెంపులు చేసుకోవడంతో పోలవరం కూడా ఆగిపోయింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం మీద పెద్దగా ఖర్చు చేయలేదు అన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు నిధులు విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ప్రాజెక్టు పూర్తి అవుతుందనే నమ్మకాలు ఏర్పడుతున్నాయి.