ఏపీ సీఎం చంద్రబాబుకి కొత్త టెన్షన్ పట్టుకుంది.  అదే ఉద్యోగులకు అమలు చేయాల్సిన పింఛన్ వ్యవహారం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సీపీఎస్ ను రద్దు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. దీనిని రద్దు చేయలేకపోయిన జగన్ సర్కారు జీపీఎస్ ను తీసుకువచ్చింది. ఇది ప్రభుత్వ పెన్షన్ పథకం. దీనిలో ఉద్యోగుల బేసిక్ పై 50 శాతం సొమ్మును పింఛన్ గా ఇస్తారు. వారం అనంతరం వారిపై ఆధారపడిన వారికి 60శాతం పింఛన్ లో భాగం ఇస్తారు.


ఇతర విషయాలు కామన్ గా ఉంటాయి. అయితే దీనిని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమకు ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలని పట్టుబట్టారు. దీనిని ఇవ్వలేమని జగన్ సర్కారు తేల్చి చెప్పింది. ఇదే ఎన్నికల సమయలో ఆ పార్టీకి ప్రాణ సంకటంగా మారిపోయింది. ఇక, సీపీఎస్ విషయంలో ఆలోచించి.. ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.


అయితే ఇప్పుడు కేంద్రం జాతీయ పింఛన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేయాలని రాష్ట్రాలను కూడా కోరింది. ఇది ఐచ్ఛికం. అంటే.. అవకాశం ఉంటే అమలు చేయొచ్చు లేదా తమకు నచ్చిన  పథకాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో చంద్రబాబు ఈ పథకంపై దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ చిత్రం ఏంటంటే.. కేంద్రం అమలు చేస్తున్నట్లు ప్రకటించిన జాతీయ పింఛన్ పథకం.. అచ్చం జగన్ తీసుకువచ్చిన జీపీఎస్ ను కాపీ కొట్టిందే.


ఇది నిజం కూడా. ఈ విషయాన్ని కేంద్రమే చెప్పింది. పలు రాష్ట్రాల్లో తీసుకువచ్చిన పథకాల నుంచి ఎన్పీఎస్ ను తీసుకువచ్చామని కేంద్రం తెలిపింది. దీనిలో చూస్తే అన్నీ కూడా జగన్ తీసుకువచ్చిన పథకంలోని అంశాలు ఉండటం గమనార్హం. దీనిని వైసీపీ స్వాగతించింది. తాము చెప్పించే కేంద్రం చేస్తుందని కూడా పేర్కొంది. గతంలో జగన్ తీసుకువస్తే వ్యతిరేకించిన ఉద్యోగులు.. ఇప్పుడు కేంద్రం తీసుకువచ్చిన ఈ విధానాన్ని అమలు చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: