రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ లోని ఆక్రమిత ప్రాంతాల  నుంచి రష్యాకు పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పుతిన్ ను పేర్కొంటూ వారెంట్ జారీ చేసినట్లు ఐసీసీ స్పష్టం చేసింది.


అయితే రెండో ప్రపంచ జ్ఙాపకార్థం నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు సెప్టెంబరు 2న పుతిన్ మంగోలియా వెళ్లనున్నారు. అయితే పుతిన్ ను ఐసీసీ కి తరలించాలని మంగోలియా అధికారులను ఉక్రెయిన్ కోరినట్లు సమాచారం. అంతే కాకుండా ఐసీసీ లో మంగోలియా సభ్య దేశంగా ఉంది. దీంతో పుతిన్ అక్కడికి వెళ్లినప్పుడు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


పుతిన్ అరెస్ట్ పై గత ఏడాది పలు వార్తలు వచ్చాయి. అయితే రష్యాలో ఉన్నంత వరకు పుతిన్ కు అరెస్ట్ భయం లేదని. ఒకవేళ రష్యాను వీడితే మాత్రం ఆయన్ను అదుపులోకి తీసుకోవచ్చని పలు నివేదికలు వెల్లడించాయి. అయితే ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో పుతిన్ పై దాదాపు అన్ని పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆయన ఇతర దేశాలకు వెళ్లడం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో పుతిన్ మంగోలియాను సందర్శించడం ప్రాముఖ్యం సంతరించుకొంది.


ఈ అనుమానంపై క్రెమ్లిన్ స్పందించింది.  అరెస్టు వారెంట్ పై భయపడాల్సిన పని లేదని స్పష్టం చేసింది. మంగోలియాతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేసింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల రష్యా పర్యటనకు వెళ్లారు. అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం అయి.. ఇరు దేశాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం గురించి మాట్లాడుతూ.. శాంతియుత మార్గంలో సంక్షోభానికి ముగింపు పలకడం అక్కడ శాంతి-స్థిరత్వం కోసం భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. యుద్ధ భూమిలో దేనికి పరిష్కారం లభించదు. చర్చలు, దౌత్యమే ముందుకెళ్లే మార్గాలు అని ఈ సందర్భంగా పుతిన్ కు ఆయన సూచించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: