బిహార్ లో రాజకీయాలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. జనతా దళ్ యూ చీఫ్, సీఎం నితీశ్ కుమార్.. బిహార్ అసెంబ్లీలో విపక్ష నాయకులు, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో భేటీ కావడమే ఇందుకు కారణం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్ననేపథ్యంలో నితీశ్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నట్లు ప్రచారం జరగుతుంది.
అయితే కేవలం సమాచార కమిషనర్ నియామకానికి సంబంధించి వీరద్దరూ భేటీ అయ్యారని సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. సమాచార కమిషనర్ నియామక కమిటీలో విపక్ష నేత కూడా సభ్యుడే అనే విషయాన్ని గుర్తు చేసింది. ఈ భేటీ తర్వాత తేజస్వీ యాదవ్ చేసిన వ్యాఖ్యలు కూడా తాజా చర్చకు దారి తీశాయి. నితీశ్ తో సమావేశం తర్వాత తేజస్వీ మీడియాతో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అంశంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని నితీశ్ గుర్తు చేయగా.. న్యాయ సమీక్షకు అతీతమైన రాజ్యంగంలో ని తొమ్మిదో షెడ్యూల్ లో 65కు రిజర్వేషన్ అంశాన్ని చేర్చేలా కృషి చేయాలని కోరాను అని ఆయన వివరించారు.
ఈ భేటీ సంచలనంగా మారడంతో మరోసారి తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. నితీశ్ ని నమ్మేది లేదు. ఆయన వాగ్దానాలపై నమ్మకం లేదు. బీజేపీతో చేరినందుకు క్షమాపణలు కోరుతున్నానని పేర్కొంటూ.. మా ఎమ్మెల్యేల ముందు చేతులు జోడించారు. రెండు సార్లు అధికారమిస్తే మోసం చేశారు. మరోసారి నితీశ్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేశారు.
అయితే ఇదే సమయంలో నితీశ్ తిరిగి వస్తాడని.. అతను తమవాడేనని ఆర్జేడీ నేత వీరేంద్ర విలేకరులతో చెప్పడం సంచలనంగా మారింది. బీజేపీతో నితీశ్ అసంతృప్తిగా ఉన్నారు. సామ్యవాద భావాలున్న నితీశ్ బీజేపీతో ఉండలేరు అని వ్యాఖ్యానించారు. కాగా దీన్ని జేడీయూ కొట్టిపారేసింది. జేడీయూ ప్రధాని అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. బీజేపీతో తమ పార్టీ కెమెస్ర్టీ మెరుగుపడుతుందని వ్యాఖ్యానించారు. తేజస్వీతో నితీశ్ భేటీ గురించి అతిగా ఊహించుకోవద్దన్నారు.