నిన్న మొన్నటి వరకు ఆయన సీఎం. పైగా ముఖ్య మంత్రి కుమారుడు. దీంతో మందీమార్బలాలు.. అధికారుల ప్రోటోకాల్.. ఎక్కడకి వెళ్లినా ఎర్ర తివాచీల స్వాగతాలు.. చీమకు కూడా దరి చేరనివ్వనంత మర్యాదలు.. గౌరవాలు,, గజమాలలు.. ఇదే శాశ్వతం అనుకున్నారు. ఇంక తిరుగులేదని లెక్కలు కూడా వేసుకున్నారు. ఆయనే వైసీపీ అధినేత జగన్.


కానీ ప్రజా తీర్పు మరోలా ఉంది. దీంతో 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. అంత ప్రోటోకాల్ కూడా పోయింది. సహజంగా అప్పటి వరకు గజరాజును ఎక్కి విహరించే రారాజు.. వెంటనే గాడిదనెక్కాల్సిన పరిస్థితి వస్తే.. ఇబ్బంది పడినట్లే.. మొహం చెల్లనట్లే.. జగన్ పరిస్థితి కూడా అలానే మారిపోయింది. దీంతో రెండు మాసాల వరకు జగన్ ప్రజల మధ్యకు రాలేకపోయారు. ఈ పరిస్థితి మంచిది కాదని పార్టీ నాయకులు, మీడియా, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ప్రజలు ఆయన్ను గెలిపించారని.. కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఆయన ధర్మం అని వీటిని పాటించాలని సూచనలు కూడా వచ్చాయి.


అయినా జగన్ కొద్ది రోజులు వాటిని పట్టించుకోలేదు. కానీ పరిస్థితులు అలా లేవు. ప్రజలు కష్టాల్లో చిక్కుకున్నారు. దీంతో జగన్ ప్రజల్లోకి వచ్చేశారు. ఆ వెంటనే పర్యటనకు రెఢీ అయిపోయారు. బాధిత ప్రాంతాల్లో పర్యటించి వారిని పరామర్శించారు. ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజలను కలుసుకున్నారు. దీంతో వైసీపీ నాయకులు కొంత ఊరట పొందారు. నిన్న మొన్నటి వరకు అభద్రతా భావంతో ఉన్న వారు కూడా ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఇంక ఆయన ప్రజల్లోనే ఉంటారు. మాకు ప్రజా సమస్యలు కొత్త కాదు. మా నాయకుడు ప్రజల సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఇక ఆయన ప్రజల్లో ఉంటారు. బాధితులను పరామర్శిస్తారు అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ చిత్రం ఏంటంటే.. పిఠాపురం పర్యటన కాగానే జగన్.. బెంగళూరు వెళ్లిపోయారు. దీంతో దిగి వచ్చారని నాయకులు సంబురాలు చేసుకున్న సమయం పెద్దగా ఎక్కువ సేపు నిలవలేదు. మరి జగన్ వ్యూహం ఏంటో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: