మంచు మోహన్ బాబు  చంద్రబాబుకి దగ్గర అవుతున్నారా? టీడీపీ అధినేత అంటేనే కస్సుబుస్సులాడే ఆయన ఇప్పుడు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అందుకే సానుకూలంగా మాట్లాడుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో చంద్రబాబు విషయంలో మోహన్ బాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.


చంద్రబాబుతో తాను సమకాలీడునని.. తమ మధ్య స్నేహం ఉండేదని.. కానీ ఆ స్నేహాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారంటూ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశారు. టీడీపీలో ఉన్న తనను చంద్రబాబు మోసం చేశారనికూడా ఆరోపణలు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తన శ్రీ విద్యానికేతన్ విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్ మెంట్ కోసం నిరసనకు సైతం దిగారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వంపై  వ్యతిరేకత వచ్చేందుకు అది కూడా ఒక కారణం అయింది.


అంతటితో ఆగకుండా ఆ ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా మోహన్ బాబు ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు పై విమర్శల వర్షం కురిపించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. కానీ మోహన్ బాబుకి ఎటువంటి గుర్తింపు లభించలేదు. కనీసం జగన్ కూడా పట్టించుకోలేదు. అప్పట్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన పృథ్వీరాజ్, పోసాని కృష్ణమురళీ, అలీలకు పదవులు దక్కాయి. కానీ మోహన్ బాబు విషయంలో మాత్రం ఎటువంటి పదవులు ప్రకటించలేదు జగన్.


ఎన్నికలకు ముందు చంద్రబాబుని మోహన్ బాబు ప్రత్యేకంగా కలిశారు. టీడీపీలో చేరతారు అనే ప్రచారం కూడా సాగింది. మోహన్ బాబు రెండో కుమారుడు టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె ను వివాహం చేసుకున్నారు. ఈ విషయమై కలిసినట్లు ప్రచారం సాగింది. ఆ తర్వాత ఆయన కూడా చంద్రబాబు తనకు మిత్రుడని అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.


ఇప్పుడు తాజాగా తిరుమల లడ్డూ వివాదంపై మోహన్ బాబు స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటూనే.. నా ఆత్మీయుడు, నా మిత్రుడు అంటూ చంద్రబాబుని ప్రస్తావించారు మోహన్ బాబు. అంతటితో ఆగకుండా కలియుగ శ్రీనివాసుడి ఆశీర్వాదంతో నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి మంచు కుటుంబం టీడీపీకి మద్దతు ప్రకటించడం కొంత ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: