వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనెలు, కొవ్వులు కలిశాయానే ఆరోపణలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం లడ్డూ అంశంపై విచారణకు సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి నేతృత్వంలో సిట్ విచారణ వేగవంతం చేసింది.


ఇప్పటికే ఈ బృందం తిరుమలకు చేరుకుంది. తిరుమలలోనే ఉండి లడ్డూ తయారీని పరిశీలించింది. అలాగే మాజీ టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, అప్పటి ఈవోలు, ఇప్పటి ఈవో శ్యామలరావు తదితరులను ప్రశ్నించనుంది.


సిట్ తన దర్యాప్తు లో భాగంగా మొదటి రోజు శ్రీవారిని దర్శించుకుంది. ఇక రెండో రోజు సెప్టెంబరు 29న సిట్ బృందం సమావేశం అయింది. ఎవరెవరు ఏయే పనులు  చేయాలో బాధ్యతలు నిర్దేశించుకుంది. మరోవైపు కల్తీ నెయ్యి సూత్రధారులు, పాత్ర ధారులపై క్రిమినల్ కేసుల నమోదుకు సిద్ధమవుతున్నారు. ఏఆర్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసి దేవస్థానాన్ని మోసం చేసిందంటూ టీటీడీ ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళీకృష్ణ ఇటీవల తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో సిట్ దర్యాప్తుకు దిగింది.


సిట్ అధిపతి త్రిపాఠి, విశాక రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజు టీటీడీ ఈవో శ్యామలరావు ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఏఆర్ డెయిరీకి టెండర్లు కట్టబెట్టిన వ్యవహారంపై ఆయన నుంచి వివరాలు సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన టెండర్ లో ప్రాథమికంగా ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి? వాటిలో గరిష్ఠ, కనిష్ట ధరలపై సరఫరా చేసేందుకు టెండెరు వేసిందెవరు? కాంట్రాక్టర్ ఎంపిక ఎలా జరిగింది? నెయ్యి సరఫరా తీరు ఎలా ఉంది వంటి అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఏఆర్ డెయిరీకి ప్రయోజనాలు కట్టబెట్టడంపై ఎవరికీ ప్రయోజనాలు ఉన్నాయో కూడా సిట్ ఆరా తీస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: