తెలంగాణ నుంచి ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు డిప్యూటేషన్ పై అక్కడ కొనసాగిన ఈ ముగ్గురు స్వరాష్ట్రం వచ్చేందుకు పెద్దగా మొగ్గు చూపడం లేదు. కేంద్రం తప్పనిసరిగా వెళ్లాలని ఆదేశించడంతో చేసేదేమీలేక వారు న్యాయ పోరాటం చేశారు. అక్కడా కూడా వారికి చుక్కెదురు కావడంతో అమరావతికి వచ్చి రిపోర్టు చేశారు.


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను కలిశారు. ఏఈపలో విధులు నిర్వహించేందుకు తమకు సమ్మతమేనని తెలిపారు. దీంతో వీరి సేవలను ఎలా వినియోగించుకుంటారో అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో యువ ఐఏఎస్ అమ్రపాలి మంచి పేరు ఉంది. సమర్థత కలిగిన అధికారిగా ఆమె గుర్తింపు సాధించారు.  ఆమెను మహా విశాఖ నగరపాలిక సంస్థ కమిషనర్ గా నియమిస్తారనే ప్రచారం సాగుతోంది.  సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.


విశాఖ వంటి నగర అభివృద్ధికి ఆమె సేవలు అవసరం అని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా ఆమెకు విశాఖతో మంచి అనుబంధమే ఉంది. ఆమె తండ్రి ఆంధ్రా యూనివర్శిటీలో ప్రొఫెసర్ గా సేవలు అందించారు. ఒంగోలు జిల్లాకు చెందిన ఆమ్రపాలి కొద్ది రోజులు విశాఖలోనే చదువుకున్నారు. వైజాగ్ సిటీ గురించి ఆమెకు పూర్తిగా తెలుసు. అందుకే జీవీఎంసీ కమిషనర్ గా నియమిస్తే మంచి సేవలు అందిస్తారని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


రాష్ట్ర విభజన తర్వాత ఆమె సర్వీస్ తెలంగాణలో కొనసాగింది. వికారాబాద్ కలెక్టర్ గా ఆమె తొలి పోస్టింగ్ దక్కింది. అక్కడ ఆమె తన పనితీరుతో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందర్నీ ఆకట్టుకున్నారు. ప్రధాని కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీ గా కూడా ఆమె కొంత కాలం పనిచేశారు. అందుకే ఆమె సేవలను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారంట. పవన్ వద్ద ఇప్పుడు ఆరు శాఖలు ఉన్నాయి. సమర్థవంతమైన టీంను సమకూర్చే పనిలో ఆయన ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో చురుకైన అధికారులను ఇక్కడికి డిప్యూటేషన్ పై తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు ఆమ్రపాలి సైతం పవన్ టీంలో చేరతారు అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. చూడాలి చివరకు ఏం జరుగుతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: