ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. రెండు వారాల కిందట ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. పాత ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి. ధరల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కొన్నిచోట్ల ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తున్నారు. దీంతో ధర తగ్గుతుందని ఆశించిన మందుబాబులు నిరాశకు గురయ్యారు. కొన్నిచోట్ల షాపుల మధ్య పోటీ ఉండడంతో అమ్మకాలు తగ్గాయి.
ఈ తరుణంలో షాపుల యజమానులు అమ్మకాలు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా మద్యం ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అయితే మద్యం ధర తగ్గించకుండా.. ఒక బాటిల్ కొంటే కోడిగుడ్డు, వాటర్ ప్యాకెట్, డిస్పోజల్ గ్లాస్ ఫ్రీ అంటూ ప్రకటిస్తున్నారు. సాధారణంగా మద్యంతో పాటు వాటర్, స్టఫ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే క్వార్టర్ మద్యం వద్ద ఓ 30 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అక్కడే వినూత్నంగా ఆలోచించారు మద్యం షాపుల యజమానులు.
ఉడకబెట్టిన కోడిగుడ్డు, రెండు రూపాయల విలువ చేసే వాటర్ ప్యాకెట్, మరో రెండు రూపాయలు విలువచేసే డిస్పోజల్ గ్లాస్ ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో సమయాభావం లేకుండా షాపు వద్ద అందుతుండడంతో మందుబాబులు అటువైపు వస్తారని వారి ఆలోచన.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో ఓ షాపు వద్ద ఇలాంటి ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చాయి. ఈ ప్రకటన మందుబాబులను ఆకట్టుకుంది. మద్యం ఆఫర్ పై ఇస్తారని అంతా భావించారు. కానీ వాటర్ తో పాటు స్టఫ్ అందిస్తుండడంతో కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. మిగతా ప్రాంతాల్లో సైతం మద్యం దుకాణాల వద్ద ఇటువంటి బోర్డులు వెలుస్తుండడం విశేషం.
అయితే మద్యం దుకాణాలతో భారీగా ఆదాయం సమకూర్చుకోవచ్చని చాలామంది భావించారు. అందుకే పోటా పోటీగా షాపులను దక్కించుకున్నారు. తేరా ఇప్పుడు వ్యాపారం లోకి అడుగుపెట్టిన వారికి నష్టం తప్పదని ఆందోళన వెంటాడుతోంది. వాస్తవానికి మార్జిన్ 20 శాతం వస్తుందనుకుంటే.. అన్ని లెక్కలు పోను 10 శాతం మిగులుతుందని.. అది కూడా సిండికేట్ కి వెళ్తుందని ఎక్కువమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.