ప్రపంచంలో ప్రమాదకరమైన దేశాధినేతల్లో ఇద్దరు అయిన రష్యా ప్రెసిడెంట్ పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్ యుద్ధంలో చేతులు తెలిపారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న పోరాటానికి ఉత్తర కొరియా తరపున పదివేల మంది వరకూ సైనికుల్ని పంపాలని నిర్ణయించింది. ఉక్రెయిన్ తో రెండున్నరేళ్లుగా రష్యా యుద్ధం చేస్తోంది.ఈ యుద్ధంలో రష్యా కొన్ని వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో సైనికుల కొరత ఏర్పడిందేమో కానీ తానున్నానంటూ మిత్రుడు కిమ్ స్నేహ హస్తం అందించారు.
కిమ్ జోంగ్ ఉన్ క్రూరమైన ఉత్తరకొరియా నియంతగా పేరు పొందారు. ఆయనకు చైనా, రష్యాతో తప్ప ఏ దేశంతోనూ సంబంధాలు ఉండవు. ఆ రెండు దేశాల అధినేతలో ప్రెండ్ షిప్ కొనసాగిస్తారు. వెళ్తే ఆయన పర్యటనలు ఆ రెండు దేశాలకే ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు గా ఉన్నప్పుడు ఆయనతో చర్చలు జరిపారు కానీ ఏ మాత్రం వర్కవుట్ కాలేదు.
ఓ వైపు దక్షిణ కొరియా తమ దేశంపై యుద్ధం చేస్తుందేమోనని.. తమ నాయకుడిపై హత్యాయత్నం చేస్తున్నారే్మోనని ఉత్తర కొరియా సైన్యం అనుమానిస్తోంది. అందుకే తమ దేశ సరిహద్దుల్ని రోడ్డు, రైలు మార్గాల్ని తవ్వేశారు. దక్షిణ కొరియా తమ దేశంపై దండెత్తాలని చూస్తే అణుబాంబులు వేస్తామని హెచ్చరికలు చేస్తూ ఉంటారు. మరో వైపు పుతిన్ కూడా అదే చెబుతున్నారు. ఉక్రెయిన్ కు అతి పెద్ద ఆయుధాలు ఇవ్వాలని ఇటీవల నాటో కూటమి నిర్ణయించింది. ఈ నిర్ణయంపై పుతిన్ ఫైర్ అవుతున్నారు.
తమ దేశంపై దాడి చేయడానికి ఆయుధాలిచ్చే దేశాలు కూడా తమకు శత్రువులేనని వాటిపై అణుబాంబులు వేయడం తమ విధానంలో భాగమేనని కూడా ప్రకటించుకున్నారు. అణుబాంబులు వేసేందుకు ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర కొరియా కూడా రష్యాతో చేతులు కలుపుతోంది. ఓ వైపు మధ్య ప్రాచ్యంలో అల్లకల్లోలం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో అన్ని దేశాలు ఒకే సారిఉద్రిక్త పరిస్థితులు తీసుకు వస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. అణు అస్త్రాలు ఉన్న ఉత్తరకొరియా, రష్యా అధ్యక్షులు తర్వాత ఏం జరుగుతుందా అన్న అంశాలను పట్టించుకోరు. అందుకే ప్రపంచం అంతా ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో ఉంది.