సీయోల్ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలుతాయని హెచ్చరించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి. ఇక ఎమ్మెల్యే హరీష్ రావు వాడపల్లి నుంచి సెక్యూరిటీ లేకుండానే పాదయాత్ర చేస్తానని సంచలన ప్రకటన చేశారు. 6 గ్యారంటీల పై నిలదీస్తామని హెచ్చరించారు.
ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న విద్యుత్ అవకతవకలపై సమగ్రంగా దృష్టి సారించింది. నాటి సీఎం కేసీఆర్ కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ కమిషన్ ప్రభుత్వానికి ఇటీవల ఒక నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా ప్రభుత్వం తదుపరి చర్యల తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో ప్రభుత్వం నియమించిన కమిషన్ దాదాపుగా విచారణ పూర్తి చేసింది. జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఇక ఫార్ములా ఈ – రేస్ నిర్వహణలో నిబంధనలు పాటించలేదని ప్రభుత్వం ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. ఏసీబీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఫార్ములా ఈ – రేస్ నిర్వహణలో కేటీఆర్, మున్సిపల్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన అరవింద్ కుమార్, ఇతర అధికారులకు నోటీసులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు పాదయాత్ర చేస్తానని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. ఆయన పాదయాత్ర మొదలుపెట్టక ముందే కోలుకోలేని షాక్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఏడాది చివరిలోగా కేటీఆర్ ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతుంది. శాసనసభ వేదికగా గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అక్రమాలను, అవకతవకలను మంత్రివర్గంలో.. శాసనసభలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం.. అందులో కేసీఆర్, ఇతర వ్యక్తులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.