జమిలి ఎన్నికలకు ముహూర్తం ఎప్పుడు? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని.. ఆ ఫలితాల ఆధారంగానే దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందని దేశ రాజధానిలో ఉన్నతాధికార వర్గాల మధ్య చర్చ జరుగుతోంది!
ఇటీవలి ఎన్నికల్లో హరియాణాను హస్తగతం చేసుకున్న కమలనాథులు.. మహారాష్ట్ర కూడా తమ వశమయితే దేశంలో తమకు తిరుగుండదని, అనేక కీలక నిర్ణయాలు తీసుకునేందుకు తమకు ప్రజామోదం లభించినట్లే భావిస్తారని ఆ వర్గాలు అంటున్నాయి. ఈ నెల 23న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార మహాయుతి (బీజేపీ+శివసేన(శిందే)+ఎన్సీపీ (పవార్)) కూటమి గనుక అత్యధిక సీట్లు సాధిస్తే.. ఆ ప్రభావం మహారాష్ట్రలోనే కాక, జాతీయస్థాయిలో ఉంటుందని ఆ వర్గాల అంచనా.
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజుల తర్వాత నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఏ బిల్లులు ప్రవేశపెట్టాలనే అంశం కూడా ఈ ఫలితాలపైనే ఆధారపడి ఉండనుంది. న్యాయశాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. జమిలి ఎన్నికలకు సంబంధించి కసరత్తు పూర్తయిందని, ఈ మేరకు బిల్లు కూడా సిద్ధమైంది తెలుస్తోంది.
మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధిస్తేనే ఆ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి స్థాయూసంఘానికి సిఫారసు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయశాఖలో ఒక అధికారి చెప్పారు. జమిలి ఎన్నికల బిల్లు ఈ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టారంటే.. 2027లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు జమిలి ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతుందని భావించాల్సి ఉంటుందని ఆయన వివరించారు.
వచ్చే ఏడాది జనాభా లెక్కల సేకరణ, 2026లో నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్‌ను అమలు చేసి 2027లో జమిలి ఎన్నికలకు వెళ్లే అవకాశాల గురించి ప్రభుత్వం ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చిందని న్యాయ శాఖ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ఫలితాలు తమకు వ్యతిరేకంగా వస్తే.. శీతాకాల సమావేశాల్ల్లో కేవలం వక్ఫ్ బిల్లును మాత్రమే ప్రవేశపెట్టి 'జమిలి' ఎన్నికల బిల్లును వాయిదా వేసే అవకాశాలున్నట్లు వివరించాయి.