అమెరికా ఎన్నికల పోరు కీలక ఘట్టానికి చేరింది. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ ట్రెండ్స్ మారిపోతున్నాయి. దీంతో, ఫలితం పైన మరింత ఉత్కంఠ పెరుగుతోంది. స్వింగ్ రాష్ట్రాల్లో పట్టు కోసం ఇద్దరు రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా వస్తున్న అంచనాలు ఇద్దరి మద్దతు దారుల్లోనూ టెన్షన్ పెంచుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు గతంలో లేని విధంగా ఆసక్తిని పెంచుతున్నాయి. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ద్రరాత్రి నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇద్దరు ప్రధాన అభ్యర్ధులు డిబేట్లు.. ఒకరి పై మరొకరు విమర్శలు .. తమ ప్రాధాన్యతలను వివరిస్తూ ప్రచారం దూసుకెళ్తున్నారు. ఇద్దరి మధ్య గెలుపు ఓటమలు తేడా చాలా స్వల్పంగా ఉన్నట్లుగా పలు సంస్థలు వెల్లడించిన ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. తాజా అంచనాల మేరకు ఏడు రాష్ట్రాలే ఇప్పుడు ఈ ఇద్దరి భవిష్యత్ ను డిసైడ్ చేయనున్నాయి.
ప్రచారం చివరి విడతతో ఇద్దరు అభ్యర్ధులు స్వింగ్ రాష్ట్రాలైన విస్కాన్సిన్, నార్త్ కరోలినా, మిషిగాన్, జార్జియా, పెన్సిల్వేనియాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు. అధ్యక్షుడిగా గెలవాలంటే మ్యాజిక్ ఫిగర్ 272. అయితే, తాజా ట్రెండ్స్ మాత్రం ఇద్దరు అభ్యర్ధుల మధ్య గ్యాప్ 50 స్థానాల లోపు ఉందని చెప్పటం మరింత ఉత్కంఠకు కారణమవుతున్నాయి. ఇప్పటికే దాదాపు ఏడు కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కమలా హరీస్ తన చివరి విడత ప్రచారం లో ప్రధానంగా ట్రంప్ ఆలోచన.. ఆయన వ్యవహార శైలి పైన గురి పెట్టారు.
ఓటర్ల నుంచి వస్తున్న స్పందనతో గతం కంటే పెద్ద సంఖ్యలో ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసారు. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం తనకు అనుకూలంగా చెప్పుకునే నార్త్ కరోలినాలో పూర్తి చేయనున్నారు. ట్రంప్ పోటీ చేసిన రెండు సార్లు ఈ రాష్ట్రం పూర్తి మద్దతుగా నిలిచింది. ఇక, న్యూమెక్సికో, వర్జీనియాల్లో ఈ సారి ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ 6సార్లు ఈ రాష్ట్రంలో ప్రచారం నిర్వహించారు. అటు కమలా హరీస్ నార్త్ కరోలినాలో ప్రచారం పూర్తి చేసారు. కమలా భర్త డగ్ ఎంహాఫ్ ప్రస్తుతం గ్రీన్ విల్లేలో ప్రచారం చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు అమెరికా ఎన్నికల్లో పోలింగ్.. ఫలితాల పైన ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.