ఏపీలో కూటమి ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా వింగ్ పై ఫోకస్ పెట్టింది. ఐదేళ్లుగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో పాటు ఈ ఐదు నెలల పాటు పెట్టిన పోస్టులపై కూడా దృష్టి పెట్టింది. అందులో భాగంగా వందలాదిమంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదయ్యాయి. క్రియాశీలక వ్యక్తులను అరెస్టులు కూడా చేశారు. వైసీపీకి మద్దతుగా నిలిచిన సినీ సెలబ్రిటీలపై సైతం కేసులు నమోదవుతున్నాయి. వారి అరెస్టులకు రంగం సిద్ధమవుతోంది.
ఈ తరుణంలో జగన్ బయటకు వచ్చారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా అంటూ నిలదీశారు. వైసిపి సోషల్ మీడియా బాధితులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీనికోసం ప్రత్యేక కాల్ సెంటర్లను సైతం అందుబాటులోకి తెచ్చారు. వారి తరుపున పోరాటం చేసేందుకు లీగల్ టీంను సైతం ఏర్పాటు చేశారు. అయితే బాధిత కుటుంబాలకు అండగా ఉండేందుకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలను తాజాగా ప్రకటించారు.
జిల్లాల వారీగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్లను ఏర్పాటు చేశారు జగన్. అక్రమ నిర్బంధాలకు గురవుతున్న సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయ సహాయం కల్పించడం, వారికి భరోసా ఇవ్వడం ఈ టీం ముఖ్య ఉద్దేశం. ఆయా జిల్లాల్లోని పార్టీ నేతలు, సంబంధిత నాయకులు, లీగల్ సెల్ ప్రతినిధులకు సమన్వయం చేసుకుంటూ ఈ పార్టీ బృందాలు పనిచేయనున్నాయి. ఇప్పటికే రాష్ట్రస్థాయిలో లీగల్ టీంను ఏర్పాటు చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలోని లీగల్ టీం సేవలందిస్తోంది. తాజాగా జిల్లాలకు టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లాకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు, శ్యాం ప్రసాద్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాకు మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు.. విశాఖ జిల్లాకు మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, కేకే రాజు.. తూర్పుగోదావరి జిల్లాకు మాజీ మంత్రి జక్కంపూడి రాజా, వంగ గీత.. పశ్చిమగోదావరి జిల్లాకు సునీల్ కుమార్ యాదవ్, జయ ప్రకాష్.. కృష్ణాజిల్లాకు మొండితోక అరుణ్, దేవ భక్తుని చక్రవర్తి… గుంటూరు జిల్లాకు విడదల రజిని, డైమండ్ బాబు.. ప్రకాశంజిల్లాకు టీజేఆర్ సుధాకర్ బాబు, వెంకట రమణారెడ్డి.. నెల్లూరు జిల్లాకు రామిరెడ్డి ప్రతాపరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి.. చిత్తూరు జిల్లాకు ఎంపీ గురుమూర్తి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.. అనంతపురం జిల్లాకు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, రమేష్ గౌడ్.. కడప జిల్లాకు సురేష్ బాబు, రమేష్ యాదవ్.. కర్నూలు జిల్లాకు హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి లను నియమించారు జగన్.