ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అవుతుందా? ఆ పార్టీకి ఛాన్స్ ఉందా? షర్మిల తో అది సాధ్యమేనా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది.
ఎన్నికలకు ముందు షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతను స్వీకరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందని అంతా భావించారు. అయితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్క షర్మిల మాత్రమే కడపలో ప్రభావం చూపించారు. లక్ష యాభై వేల వరకు ఓట్లు సాధించగలిగారు. మిగతా చోట్ల కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. వైసీపీ ఓటమితో ఆ పార్టీ నుంచి చేరికలు పెరుగుతాయని అంతా భావించారు. కానీ ఒక్కరు కూడా కాంగ్రెస్ వైపు రాలేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలపడగలదా? అందుకు తగ్గ ఛాన్స్ ఉందా? అంటే ఏదీ కనిపించడం లేదు. మరోవైపు జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ పార్టీ మళ్లీ పరాజయాల బాట పడుతోంది. దీంతో ఆ ప్రభావం ఏపీ లాంటి రాష్ట్రాల్లో పడుతోంది. ఎక్కడా లేని విధంగా ఏపీలో పూర్తిగా నిర్వీర్యం అయింది కాంగ్రెస్ పార్టీ. దానికి జవసత్వాలు నింపడం షర్మిల వల్ల కూడా కాలేదు.
కాంగ్రెస్ బలపడాలంటే అది జాతీయస్థాయిలో బలోపేతం అయితేనే సాధ్యం. ఎప్పుడైతే జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు కనబరుస్తుందో.. ఆ మరుక్షణం ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. వైసీపీ ఘోర పరాజయం తర్వాత.. కాంగ్రెస్ పార్టీ సాధారణంగా బలపడాలి. వైసీపీలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ శ్రేణులే. అయితే జాతీయస్థాయిలో కాంగ్రెస్ బలోపేతం కాకపోవడం.. వివిధ రాష్ట్రాల్లో ఘోర పరాజయం చవిచూడడంతో.. అటువైపు వచ్చేందుకు వైసిపి నేతలు ఇష్టపడడం లేదు.
కర్ణాటక తో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పట్లో ఏపీ ఫై కూడా ఆ ప్రభావం పడింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినా… కాంగ్రెస్ రూపంలో ఒక ప్రత్యామ్నాయం ఉందన్న ధీమా నేతల్లో వ్యక్తం అయింది. కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆశలు సన్నగిల్లాయి. షర్మిల ఎంతగానో ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి మైలేజీ రావడం లేదు. షర్మిల కాదు అంతకంటే చరిష్మ కలిగిన నేతకు పగ్గాలు అందించినా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుకు వెళ్లలేని దుస్థితి.