వైసీపీలో రెబెల్ ఎంపీగా నాలుగున్నరేళ్ల పాటు పోరాడిన రఘురామ క్రిష్ణం రాజు ఇపుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉప సభాపతిగా అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నారు. లేటెస్ట్ గా ఆయన జగన్ గురించి మాట్లాడుతూ జగన్ అసెంబ్లీకి రావాలని మరోమారు కోరారు. అసెంబ్లీకి వస్తే ఆయనకు ఎటువంటి అవమానం జరగకుండా తాను చూసుకుంటానని భారీ ఆఫర్ ఇచ్చారు.
సభలో ఏకైక విపక్ష పార్టీగా వైసీపీ ఉందని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షమూ అవసరమేనని ఆయన అన్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఆయనకు తగినంత సమయం ఇస్తామని అన్నారు. ఒక పార్టీకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉంటేనే విపక్ష హోదా అన్నది రాజ్యాంగంలో ఎక్కడా లేదని అదే సమయంలో అలాంటి నిబంధన లేనపుడు ఆనవాయితీని ఆచరించవలసి ఉంటుందని కూడా ఉందని అన్నారు.
ఇది ఈ రోజుది కాదని 1950 దశకం తొలి రోజులలో లొక్ సభ స్పీకర్ హుకుం సింగ్ టైం లో ఈ ఆనవాయితీని పెట్టారని అన్నారు. సభ అంటే కోరం ఉండాలి కాబట్టి కనీసం పదవ వంతు అయినా ఉండాలన్నది ఒక విధానంగా ఉందని, అదే చివరికి ఆనవాయితీగా మారిందని అన్నారు. రెండు సార్లు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష హోదా కూడా ఈ ఆనవాయితీ ప్రకారమే దక్కలేదని గుర్తు చేశారు.
లేని సంప్రదాయం ఏపీలో తెచ్చి తనకు కావాలని జగన్ కోరడం మంచిది కాదని అన్నారు. ప్రశ్నోత్తరాల నుంచి కూడా జగన్ కి తగినంత సమయం మాట్లాడేందుకు ఉంటుందని అన్నారు. జగన్ వచ్చే బడ్జెట్ సెషన్ కి అయినా సభకు వస్తారని రావాలని ఆశిస్తున్నామని రఘురామ అన్నారు. ప్రతిపక్ష హోదా విషయంలో వైసీపీ కోర్టుకు వెళ్ళిందని కానీ అది స్పీకర్ పరిధిలోని అంశంగానే తాను భావిస్తున్నానని అన్నారు.
తాను డిప్యూటీ స్పీకర్ గా ఉండడం ఆయనకు రుచిందదేమో అన్న యాంకర్ ప్రశ్నకు రఘురామ బదులిస్తూ నేను వైసీపీ ప్రభుత్వంతో దెబ్బ తిన్నా కూడా నా అంతట నేనే ఆయన వద్దకు వెళ్ళి సభకు రావాలని కోరాను అని గుర్తు చేశారు. డిప్యూటీ స్పీకర్ గా తనకు అన్ని పార్టీలూ ఎమ్మెల్యేలను గౌరవించడం విధి అని అన్నారు. ఒక ఎమ్మెల్యేగా జగన్ కి గౌరవమే సభలో ఇస్తారు తప్ప వేరే విధంగా కించపరచేది ఉండదని రఘురామ అన్నారు.