వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2024 అయితే ఆయనకు అసలు బాగా లేదనే అంటున్నారు. భారీ ఓటమి తరువాత వరసబెట్టి నేతలు పార్టీ మారుతున్నారు.అలా పార్టీ నుంచి జంప్ చేసిన వారు అంతా జగన్ దే తప్పు అని నిందిస్తున్నారు. ఇక తమకు తీరని అన్యాయం జరిగింది అని అంటున్నారు. వైసీపీలో ఉండడం కంటే రాజకీయాలకు దూరంగా ఉండడమే బెటర్ అని నిర్ణయానికి వచ్చి మరీ వారు పార్టీని వీడిపోతున్నారు.
గత ఆరు నెలలుగా చూస్తే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు ముగ్గురితో పాటు వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మాజీ నేతలు అంతా పార్టీ మారారు. ఇపుడు మాజీ మంత్రులు కీలక నాయకులు పార్టీ వీడుతున్నారు. ఒకే రోజున విశాఖ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తే భీమవరం కి చెందిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ ఇద్దరూ వైసీపీలో తమకు అన్యాయం జరిగిందేనే అంటున్నారు.
తమకు సరైన గుర్తింపు దక్కలేదని అంటున్నారు. గ్రంధి శ్రీనివాస్ అయితే తనకు మంత్రి పదవి దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తూంటే అవంతి శ్రీనివాస్ తనకు మంత్రి పదవిని మూడేళ్ళకే తీసి పక్కన పెట్టారని బాధ పడుతున్నారని నాటి నుంచే అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
వైసీపీలో ఉండకుండా బయటకు వస్తున్న వీరు కొన్నాళ్ళ పాటు రాజకీయాల ఊసే ఎత్తమని అంటున్నారు. ఈ ఇద్దరు సంగతి ఇలా ఉంటే మూడవ వికెట్ కూడా డౌన్ అవుతుందని అంటున్నారు. ఆయన ఎవరో కాదు మాజీ మంత్రి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా అనేకసార్లు గెలిచినవారు వైసీపీ ఓటమి పాలు అయ్యాక ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు.
ఈ ఇద్దరు రాజీనామాల నేపధ్యంలో ఆయన కూడా ఎర్ర జెండా చూపిస్తారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే వరసగా జగన్ కి మూడవ షాక్ తప్పదని అంటున్నారు. వైసీపీలో ఇలా నేతలు అంతా కూడబలుక్కొని అన్నట్లుగా పార్టీని వీడడం చూస్తూంటే కనుక రాజకీయంగా వైసీపీ పెను సంక్షోభం ఎదుర్కొంటోందని అర్థం అవుతోంది అని అంటున్నారు. ఇలా నేతలు అంతా రాజీనామాల బాట పడితే వైసీపీ భవిష్యత్తు మీద క్యాడర్ అయితే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.