అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి.. తన ప్రమేయం ఏ మాత్రం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.  చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. పుష్ప సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్డు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయిందని.. ఆమె కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకే పోలీసులు చర్యలు తీసుకున్నారని.. అరెస్ట్ కంటే ముందు అల్లు అర్జున్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారని రేవంత్ వివరించారు.



ఆ తర్వాత రేవంత్ అంతటితోనే ఆగలేదు. ఢిల్లీలో విలేకరులతో జరిగిన చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ” ఆయన ఏమైనా సరిహద్దుల్లో యుద్ధం చేశాడా? నాలుగు సినిమాలు చేశాడు.. అందులో పెట్టుబడి పెట్టాడు.. అంతకంటే ఎక్కువ పైసలు సంపాదించాడు. ఇవాళ ఏదో ఆయన అరెస్టు ను రకరకాలుగా చిత్రీకరించడం సరికాదని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా మీడియాలో సంచలనం నమోదయింది.  


మీడియా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయాన్ని పక్కనపెట్టి.. అతడికి బెయిల్ వచ్చిన విషయాన్ని ప్రస్తావించడం మానేసి.. రేవంత్ చేసిన వ్యాఖ్యలకే ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టింది.  


రేవంత్ రెడ్డి ఇటీవల నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత విషయంలో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం మొహమాటం లేకుండా చెప్పేశారు.   ” ఒక సినీ నటుడు తన సినిమాను ఇంట్లో చూసుకోవచ్చు. లేకుంటే హోమ్ థియేటర్లో చూసుకోవచ్చు. అంతేగాని అంతమంది జనం వచ్చినచోటకు కార్లో చేయి ఊపుతూ రావడం వల్ల జనం భారీగా వచ్చారు. ఆ సమయంలో వారందరినీ కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కాలేదు. అందువల్లే తొక్కిసలాట జరిగింది. ఫలితంగా ఓ భర్త తన భార్యను కోల్పోవాల్సి వచ్చింది. తన కుమారుడిని కాపాడుకునేందుకు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇంతకంటే దారుణం ఏముంటుందని” రేవంత్ వ్యాఖ్యానించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: