అందరూ అడుక్కునేవారే అయితే వేసేది ఎవరు అనే సమెత ఉంది. ఒకప్పుడు పొట్ట కూటి కోసం యాచించేవారు. కానీ, ఇప్పుడు యాచన ఒక వృత్తిగా మారింది. దీని వెనుక పెద్ద మాఫియా కూడా ఉంది.వేల మందికి ఉపాధి మార్గంగా ఉపయోగపడుతోంది. దీంతో యాచించేవారి సంఖ్య నగరాల్లో భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రోడ్లపై యాచకుల కారణంగా వాహనదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇండోర్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భిక్షాటనపై నిషేధం విధించారు. యాచకులకు సాయం చేసేవారిపైనా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. యాచకుల్లో కొందరికి ఇళ్లు, పిల్లలకు ఉద్యోగాలు ఉన్నట్లు గుర్తించి ఈ మేరకు నిషేధం విధించారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. వరుసగా మూడుసార్లు అవార్డు పొందింది. ఈ నేపథ్యంలో దానిని నిలుపుకునేందుకు 2025 జనవరి 1 నుంచి భిక్షాటనపై నిషేధం విధించింది. యాచకులకు సాయం చేసేవారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈమేరకు అధికారులు కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇండోర్‌ను యాచకులు లేని నగరంగా మార్చేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆంగ్ల నూతన సంవత్సరం నుంచి భిక్షాటనను నిషేధించారు. యాచకులకు సాయం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇండోర్‌ను యాచకులు లేని నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇండోర్ కలెక్టర్ ఆశిష్ సింగ్ ఇండోర్‌లో భిక్షాటనపై నిషేధం విధించారు. డిసెంబర్ చివరి నాటికి ఈమేరకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. భిక్షాటన చేసేవారికి ఎవరూ ఎలాంటి సాయం చేయొద్దని కోరారు. వారికి పునరావాస కంద్రాలకు తరలించాలని అధికారులకు సూచించారు.
భిక్షాటన దేశంలో పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. కొందరు భిక్షాటనను ఒక వ్యాపారంగా మార్చారు. మాఫియానే నడిపిస్తున్నారు. చిన్న పిల్లలను, పేదలను యాచక వృత్తిలోకి దించుతున్నారు. దీంతో వారిలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. పొద్దంతా యాచించేవారు రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో యాచకులు లేని నరగాలను తీర్చిదిద్దాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా పది నగరాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇండోర్ అధికారులు చర్యలు ప్రారంభించారు. భిక్షాటన చేసేవారి వివరాలు సేకరిస్తున్నారు. కొందరి వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. కొందరికి పక్కా ఇళ్లు, మరికొందరి పిల్లలకు ఉద్యోగాలు ఉన్నాయని గుర్తించారు. అందుకే అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా భిక్షాటనను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. యాచకులను పునరావాస కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.