తెలంగాణ అసెంబ్లీలో శనివారం.. "పుష్ప-2" సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన ఘటన, తదనంతర పరిణామాలు, రేవంత్ వ్యాఖ్యలు, అక్బరుద్ధీన్ ఆరోపణలతో వాడీ వేడి చర్చ సాగింది! ప్రధానంగా థియేటర్ వద్ద ఘటన జరిగిన సమయంలో అల్లు అర్జున్ వ్యాఖ్యానించినట్లు తనకు సమాచారం ఉందంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి.
అనంతరం... ఈ ఘటనకు ముందు, తర్వతా జరిగిన వ్యవహారాలపై అటు హిందీలోనూ, ఇటు తెలుగు లోనూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనంగా మారాయి. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న వ్యక్తిని కాకుండా.. ఒక రోజు జైలుకి వెళ్లి వచ్చిన సినిమా హీరోను పరామర్శించడానికి సినీ ప్రముఖులు అతని ఇంటి వద్ద క్యూ కట్టారని మండిపడ్డారు.
అనంతరం ఈ వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఇందులో భాగంగా... పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించిందని తెలిపారు.
ఇందులో భాగంగా... రాష్ట్ర ప్రభుత్వం తరుపున బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు అందించన్నున్నట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇదే సమయంలో... తెలంగాణలో ఇకపై ఏ సినిమా విడుదలకు ముందు రోజు ఎటువంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఉండవని మంత్రి స్పష్టం చేశారు.
ఇదే సమయంలో... టిక్కెట్ రేట్ల పెంపుకూ అనుమతి ఇవ్వబోమని పేర్కొన్నారు. మరోపక్క... తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పోందుతున్న బాలుడి కుటుంబానికి పరిహారం ఇస్తామన్న హామీని అల్లు అర్జున్ నిలబెట్టుకోలేదని మంత్రి వెళ్లడించారు. ఈ సందర్భంగా... శ్రీతేజ్ వైద్య ఖర్చులు అన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుందని అన్నారు. ఈ పరిణామాల అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి తనను వ్యక్తిత్వం హననం చేస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మొత్తంగా ఈ పుష్ప ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ మొత్తం మీద పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.