వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు అందరికీ తెలిసిందే. ఆస్తుల వివాదం తర్వాత మొదటిసారి వైఎస్ జగన్, విజయమ్మలు కలిసి బహిరంగంగా కనిపించారు. దాంతో మీడియా తో పాటు అక్కడ ఉన్న వారికి అది అత్యంత ప్రాధాన్యత సంతరించకున్న వార్త అయింది. జగన్ నాలుగు రోజుల పర్యటన కోసం సొంత జిల్లా కడపకు వచ్చారు. పులివెందులలోని ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అక్కడికి తల్లి విజయమ్మ కూడా వచ్చారు.
ఈ ఇద్దరూ కూడా కొద్ది సేపు మాత్రమే మాట్లాడుకోవడం కనిపించింది. మరోవైపు చూస్తే విజయమ్మకు ఇచ్చిన సరస్వతీ పవర్ ఆస్తులను తిరిగి షర్మిలకు బదిలీ చేయాలని జగన్ గతంలో ట్రిబ్యునల్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. జగన్ షర్మిల మధ్య తీవ్రమైన ఆస్తి పోరుకు కూడా ఇది దారితీసింది.
ఆ తరువాత విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. జగన్ షర్మిల ఇద్దరూ తన బిడ్డలే అన్నారు. రెండు కళ్ళుగా అభివర్ణించారు. అంతే కాదు, ఇద్దరూ కూడా ఆస్తులను సమానంగా పంచుకోవాలని కూడా సూచించారు. ఇంకో వైపు చూస్తే ఈ ఆస్తులు అన్నీ జగన్ సొంతంగా సంపాదించుకున్నవి కాబట్టి వాటాల ప్రసక్తి లేదని వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ విజయమ్మ ప్రకటన కొంత వైసీపీకి ఇబ్బందిగా మారింది. ఇలా జరిగాక విజయమ్మతో జగన్ భేటీ కావడం ఇదే తొలిసారి అని చెప్పాలి.
జగన్ సతీమణి వైఎస్ భారతి అత్తగారు విజయమ్మ దగ్గర కాకుండా దూరంగా ఉండడాన్ని మీడియా ఫోకస్ చేస్తోంది. సాధారణంగా అయితే ఇడుపులపాయలో జరిగే కార్యక్రమాలలో అత్తా కోడలు సన్నిహితంగా కలసి మెలసిన దృశ్యాలు గతంలో కనిపించేవి. ఇపుడు అలాంటివి లేవని అంటున్నారు. భారతి ముభావంగానే కూర్చున్నారు అని అంటున్నారు. దీంతో ఆస్తుల గొడవ దివంగత నేత కుటుంబాన్ని రెండుగా చీల్చేశాయా అన్న చర్చ సాగుతోంది.
వైఎస్సార్ అభిమానులు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా ఈ రకమైన సన్నివేశాలను చూడలేకపోతున్నారు. తొందరలో ఇవన్నీ పరిష్కారం అయితే బాగుంటుంది అని వారు ఆశిస్తున్నరు. అంతే కాదు కుటుంబం అంతా ఒక్కటిగా ఉండాలని అంతా కలసి ముచ్చటగా ఉండాలని కూడా కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇడుపులపాయకు వైఎస్సార్ కుటుంబం మొత్తం వచ్చింది. ప్రత్యేక పూజలను అక్కడ నిర్వహించారు.