సాధారణ జట్టుగా ఉన్న పాకిస్థాన్ క్రికెట్ జట్టును ప్రపంచ చాంపియన్ చేసిన ఆ నాయకుడు.. రాజకీయాల్లో మాత్రం ప్రత్యర్థులను తట్టుకోలేకపోయాడు.. ప్రతిభ ఉన్న కుర్రాళ్లను వెలికితీసి సానపట్టిన ఆ గొప్ప కెప్టెన్..దేశ ప్రధానిగా మాత్రం అవినీతి ముద్ర వేసుకున్నాడు..70 ఏళ్లు దాటిన వయసులో జైలు శిక్షను అనుభవిస్తూ.. ఇక జీవితం అక్కడే ముగిసిపోయేలా కనిపిస్తున్నాడు.
ప్రజా ప్రభుత్వం కంటే సైన్యం పెత్తనం ఎక్కువగా ఉండే పాకిస్థాన్ లో మాజీ ప్రధాని, తెహ్రీక్ ఎ పాకిస్థాన్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ కు మరిన్ని కష్టాలు ఎదురయ్యాయి. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్, ఆయన భార్య బుష్రా బీబీలను కోర్టు దోషులుగా తేల్చింది. ఇమ్రాన్ కు 14 ఏళ్ల జైలు శిక్ష పడగా.. బుష్రాకు ఏడేళ్ల జైలు శిక్ష పడింది. అడియాలా జైలులో పటిష్ఠ భద్రత నడుమ న్యాయమూర్తి ఈ తీర్పు ఇచ్చారు.
అల్ ఖాదిర్ కేసును ఇమ్రాన్ దంపతులపైనే కాక మరో ఆరుగురి పైనా పాకిస్థాన్ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో 2023లో నమోదు చేసింది. లండన్ లో ఉండే పాక్ రియల్టర్ మాలిక్ రియాజ్ హుసేన్ నుంచి వసూలుచేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ పాకిస్థాన్ కు ఇవ్వగా దానిని ఇమ్రాన్ దంపతులు గోల్‌మాల్ చేశారనేది ఈ కేసు. దీనినే అల్ ఖాదిర్ ట్రస్టు కేసు అంటున్నారు. డబ్బు వచ్చిన సమయంలో ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నారు.
దానిని జాతీయ ఖజానాలో జమ చేయకుండా.. సుప్రీంకోర్టు గతంలో రియాజ్ కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్నికట్టేందుకు అనుమతించారని నేషనల్ అకౌంటబులిటీ అభియోగం మోపింది. దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతుల ట్రస్టు నెలకొల్పదలచిన అల్‌ఖాదిర్ విశ్వవిద్యాలయానికి హుసేన్ 57 ఎకరాలను బహుమానంగా ఇచ్చినట్లు చెబుతున్నారు. కాగా ఆగస్టు 2023 నుంచి ఇమ్రాన్ జైల్లోనే ఉన్నారు. ఇప్పటికే 200 పైగా కేసులు నమోదయ్యాయి. అయితే, ఇటీవల జైలు శిక్ష సస్పెండ్ కావడంతో బుష్రా బీబీ బయటకు వచ్చారు.