డ్రాగన్ దేశం ఇబ్బందుల్లో పడింది.  ఒకప్పుడు ప్రపంచంలో జనాభాలో చైనా టాప్ ప్లేసులో కొనసాగింది.  కానీ.. ఇప్పుడు అదే దేశం జనాభా వృద్ధిలో కొట్టుమిట్టాడుతోంది.  జనాభా వృద్ధి లేక నానాటికీ పరిస్థితి దిగజారిపోతోంది.  వరుసగా మూడో ఏడాది కూడా చైనా జనాభా తగ్గిపోవడం మరింత ఆందోళనకు గురిచేసింది.  2023తో పోలిస్తే 13.90 లక్షల మేర జనాభా తగ్గిపోయింది.  


ఇప్పటికే చైనాలో వృద్ధుల జనాభా పెరుగుతోందని, పనులు చేయగలిగే సామర్థ్యం ఉన్న వారి సంఖ్య తగ్గుతోందని, యువత సంఖ్య పూర్తిగా తగ్గుముఖం పడుతోందని వారు అంటున్నారు.  ఫలితంగా జనాభా తగ్గిపోతున్న జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తూర్పు ఐరోపా దేశాల జాబితాలో చైనా సైతం చేరిపోయింది. చైనాలో ప్రతి 104 మంది పురుషులకు 100 మంది మహిళలు మాత్రమే ఉన్నారు.  ఈ లెక్కలు చైనా ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినా... పురుష, మహిళ జనాభాలో వ్యత్యాసం ఇంకా చాలా వరకు ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


చైనా జనాభాలో ఐదింట ఒకవంతు లేదంటే 22 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నారు. ప్రధానంగా 31.30 కోట్ల మంది వృద్ధులు ఉన్నారని లెక్కల్లో తేలింది. 2035 నాటికి ఈ వయో పరిమితికి చేరుకునే వారి సంఖ్య జనాభాలో 30 శాతం మించుతుందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. 2023తో పోలిస్తే 2024లో చైనాలోని గ్రామీణ ప్రాంతాల నుంచి దాదాపు కోటి మంది పట్టణాలు, నగరాలకు వలస వెళ్లినట్లు నివేదికలో స్పష్టం చేశారు.  అలాగే.. చైనాలో పట్టణీకరణ రేటు 67 శాతంగా ఉందని తెలిపింది.


చైనా దేశంలో ప్రజల జీవన వ్యయం బాగా పెరిగింది. దీంతో చాలా మంది యువత త్వరగా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదని వాస్తవం. సరైన ఆదాయమార్గాలు లేకపోవడంతో పెళ్లయిన వారు సైతం పిల్లలను కనేందుకు సాహసం చేయడం లేదని తెలుస్తోంది. అందుకే చైనాలోని వృద్ధుల సగటు ఆయుర్దాయం బాగా పెరిగినట్లు అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఇదే సమయంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా ఆ ప్రభావం దేశ జనాభా తగ్గుదలపై పడింది.


ఒక దేశ ఆర్థిక శక్తిని ముందుకు నడిపించడంలో అత్యంత కీలక పాత్ర పోషించేది పనిచేసే యువకులే. జనాభా అండతోనే ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా చైనా ఎదిగింది. అలాంటి దేశానికి ఇప్పుడు జనాభా తగ్గుదల శాపంగా మారింది.  గత నాలుగేళ్లుగా జనాభా పెరుగుదలపైనే ఆ దేశం దృష్టి పెట్టింది.  ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు దంపతులకు ప్రోత్సాహకాలను సైతం ప్రకటించింది.


గత సంవత్సరం అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో చైనా ఆర్థిక వ్యవస్థ 5.4 శాతం వృద్ధి రేటును సాధించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది.  దేశంలోని కంపెనీలకు ఉద్దీపన ప్యాకేజీలు ఇవ్వడం, ఎగుమతుల జోరు ఉండడంతో ఇది సాధ్యపడింది. డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టగానే చైనా సరుకులపై పన్నులు పెంచుతారనే ఆందోళన నేపథ్యంలో ఈ మూడు నెలల వ్యవధిలో భారీగా ఎగుమతులు జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: