తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ 11 ఏళ్ల తర్వాత మొదలైంది. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన పేరుతో రేషన్‌ కార్డుతోపాటు వివిధ పథకాల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది.


దీంతోపాటు ఇటీవల కుల గణన చేపట్టింది. ఇప్పుడు రేషన్‌ కార్డు జారీకి అర్హుల జాబితా ఆధారంగా సర్వే నిర్వహిస్తోంది. జనవరి 26 నుంచి రేషన్‌ కార్డుల జారీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జనవరి 20 వరకు సర్వే చేస్తారు. 21 నుంచి 25 వరకు గ్రామ, వార్డు సభలు నిర్వహించి లబ్ధిదారుల జాబితాకు ఆమోదం తెలుపుతారు. అనంతరం కార్డులు జారీ చేస్తారు.


ఇదిలా ఉంటే.. పదేళ్లుగా ఎదురు చూస్తున్న ఆశావహులు అర్హుల జాబితాలో తమ పేరు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పత్రికల్లో, టీవీల్లో కథనాలు వస్తున్నాయి. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను తప్ప పడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హుల జాబితాలో పేరు లేనివారికి మరో అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.


రాష్ట్రంలో అర్హత ఉన్న అందరికీ రేషన్‌ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్‌ భరోసా ఇచ్చారు. పాతకార్డులు తొలగించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పాత కార్డులు అలాగే ఉంటాయన్నారు. పాత కార్డుల్లో కొత్త సభ్యులను చేరుస్తామని తెలిపారు. కులగణన ఆధారంగానే రేషన్‌కార్డుల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రకటిస్తున్న అర్ముల జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందొద్దని తెలిపారు. గ్రామ సభల్లో మళ్లీ దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి కార్డులు ఇస్తామన్నారు. రేషన్‌కార్డుల జారీ అనేది ఇక నిరంతర ప్రక్రియ అని వెల్లడించారు. దీంతో జాబితాలో పేర్లు లేనివారికి మరో అవకాశం దొరికింది.


ఇదిలా ఉంటే.. జనవరి 26 నుంచి కొత్త రేషన్‌కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.ఈ మేరకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలో 2.81 కోట్ల మందికి ఇప్పటికే 90 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. అర్హత ఉన్న మరో 6 లక్షల మందికి కార్డులు జారీ చేయాలని రేవంత్‌ సర్కార్‌ భావిస్తోంది. దీంతో రేషన్‌కార్డు సంఖ్య 96 లక్షలకు పెరుగనుంది. దీంతో పేదల జాబితా 80 శాతానికి పెరుగుతంది.

మరింత సమాచారం తెలుసుకోండి: