అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగాల కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది క్యూ కడుతున్నారు. వివిధ సంస్థలు కూడా విదేశీయులనే రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. డాలర్‌ డ్రీమ్‌ నెరవేర్చుకునేందుకు భారతీయులతోపాటు వివిధ దేశాల నుంచి ఏటా లక్షల మంది అగ్రరాజ్యానికి వెళ్తున్నారు.  వీరికి ఆ దేశం హెచ్‌-1బీ వీసాలు జారీ చేస్తోంది.  గడిచిన నాలుగేళ్లలో లక్షల మంది భారతీయులే అమెరికా వెళ్లారు.  


వీరికి జారీ చేసే వీసా మూడేళ్ల కాలపరిమితి ఉంటుంది.  తర్వాత దానిని పొడిగిస్తారు.  గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసిన ట్రంప్‌ తాను అధికారంలోకి వస్తే ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు కఠినతరం చేస్తామని హామీ ఇచ్చారు.  గ్రేట్‌ అమెరికా మేక్‌ ఎగైన్‌ నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేశారు.  దీంతో అమెరికన్లు ట్రంప్‌కు పట్టం కట్టారు.



అయితే ఇప్పుడు అధికారం చేపట్టక ముందే హెచ్‌-1బీ వీసాల జారీపై చర్చ మొదలైంది. విదేశీయులకు వీసాల జారీని డోజ్‌(డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియన్సీ) కో చైర్మన్లు ఎలాన్‌ మస్క్, వివేక్‌రామస్వామి సమర్థించారు. నిపుణులు అమెరికాకు అవసరమని, అందుకే ఈ వీసాల జారీ కొనసాగించాలన్నారు.  వీరి వాదనను తాజాగా ట్రంప్‌ కూడా సమర్థించారు.   మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌ సంస్థ వీరి వాదనను వ్యతిరేకిస్తోంది.


ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు చేపట్టనున్నారు.  ఈ తరుణంలో అమెరికాసెనెటర్‌ బెర్నీ శాండర్స్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్‌-1బీ వీసాలు అమెరికన్‌ ఉద్యోగుల పాలిట శాపంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు.  అమెరికన్లకు ఇవ్వాలన్సి ఉద్యోగాలను పలు కంపెనీలు విదేశీ ఉద్యోగులకు తక్కువ వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయని ఆరోపించారు.  దీంతో అమెరికన్లు నష్టపోతున్నారని పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసాల జారీకి చట్ట సవరణ చేయాలని ప్రతిపాదించారు.


హెచ్‌-1బీ వీసాల కోసం చెల్లించే రుసుము చెట్టింపు చేయాలన్నారు. దీనిద్వారా లభించే ఆదాయంతో 20 వేల మంది అమెరికన్‌ విద్యార్థులకు స్కాలర్‌ షిప్‌ఇవ్వొచ్చని తెలిపారు.  ఇక హెచ్‌-1బీ కార్మికులకు కంపెనీలు చెల్లించే వేతనాలను కూడా భారీగ పెంచాలన్నారు.  తక్కువ వేతనాలకు వచ్చే విదేశీ కార్మికులను నియమించుకోవడం ద్వారా కార్పొరేట్‌ సంస్థలు భారీ మొత్తంలో డబ్బు మిగుల్చుకుంటున్నాయని ఆరోపించారు. హెచ్‌-1బీ వీసాల జారీని సమర్థిస్తున్న ఎలాన్‌ మస్క్, వివేక్‌ రామస్వామిపై శాండర్స్‌ విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: