ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇకనుంచి పౌర సేవలు, ధ్రువపత్రాల జారీని మరింత సులభతరం చేయనుంది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించేందుకు నిర్ణయించింది. తెనాలిలో వాట్సాప్ ద్వారా జనన, మరణ ధ్రువపత్రాలు అందించనుంది. ఈ విధానం అమల్లోకి వస్తే.. క్షణాల్లో జనన మరణ ధ్రువపత్రాలు పొందవచ్చు.
సాధారణంగా జనన మరణ ధ్రువపత్రాలు పొందాలంటే గతంలో పెద్ద సాహసమనే చెప్పాలి. ఒక్కోసారి ఆ ధ్రువపత్రాలు పొందాలంటే భారీగా సమర్పించుకోవాల్సి ఉండేది. అందుకే ప్రభుత్వం ప్రజా ప్రయోజనార్థం జనన మరణ ధ్రువపత్రాల జారీని వాట్సాప్ ద్వారా చేపట్టాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా తెనాలిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ అమలు చేయడం ద్వారా.. మిగతా ప్రాంతాలకు విస్తరించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయనంద్ సమీక్ష కూడా చేశారు. వాట్సాప్ ద్వారా జనన మరణ ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.
జనన మరణ ధ్రువపత్రాలు జారీ చాలా సులువు. కానీ ఓ నాలుగు శాఖలు సమన్వయంతో పని చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ, పంచాయితీ రాజ్, పురపాలక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్ టి జి ఎస్ అధికారులు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించేందుకుగాను ఏపీ ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది. కొద్ది రోజుల కిందట ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఒప్పందం కూడా జరిగింది.
పారదర్శకమైన, సులభతరమైన పౌర సేవలు అందించేందుకే ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించింది. ఇప్పటికే రకరకాల ప్రభుత్వ సేవల్లో యంత్రాంగం నిమగ్నమై ఉంటుంది. అన్ని వివరాలతో కూడిన దరఖాస్తులు వచ్చిన వెంటనే జనన మరణ ధ్రువపత్రాలు జారీ చేసే వీలుగా అన్ని ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. సక్సెస్ అయిన తరువాత రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో అమలు చేసేందుకు సిద్ధపడుతోంది.