హైదరాబాద్ మహా నగర పరిధిలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించాడు ఓ దుర్మార్గుడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలోని మీర్‌పేట్ జిల్లెలగూడ న్యూవెంకటరమణ కాలనీలో చోటు చేసుకుంది. జనవరి 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జనవరి 16న తన భార్య వెంకటమాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లి సుబ్బమ్మతో కలిసి భర్త గురుమూర్తి మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే, గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న పోలీసులు.. గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
తానే భార్యను హత్య చేసినట్లు నిందితుడు గురుమూర్తి పోలీసుల ముందు అంగీకరించాడు. తన భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించినట్లు తెలిపాడు. ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువుల పడేసినట్లు చెప్పాడు. తన భార్య హత్యకు ముందు ఓ కుక్కను చంపినట్లు తెలిపాడు. గురుమూర్తి చెప్పిన విషయాలపై ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
వెంకటమాధవి మృతదేహం ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టారు. కాగా, గురుమూర్తి గతంలో ఆర్మీలో పనిచేసి రిటైరయ్యాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం వెంకటమాధవితో గురుమూర్తికి వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటమాధవి మిస్సింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. హత్య జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. నిందితుడి వివరాలతో పాటు పోలీసులు తమదైన శైలిలో విచారణ జరుపుతున్నారు. ఇది ఇలావుండగా, అనుమానంతో రెండు రోజుల క్రితం గర్భవతి అయిన భార్యను అతి కిరాతకంగా చంపాడు మరో దుర్మార్గుడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకుంది.