బీజేపీ అగ్రనాయకత్వం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఏపీ కంటే తెలంగాణలో ముందుగా ఎన్నికలు రానున్న తరుణంలో అక్కడ బలమైన నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏపీలో కూటమి నేపథ్యంలో సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేసే నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చూస్తోంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షులను మార్చాలని బీజేపీ డిసైడ్ అయ్యింది.
రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఏపీకి సంబంధించి 26 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు అతి త్వరలో రాష్ట్ర అధ్యక్షులను సైతం ఖరారు చేసే ఛాన్స్ కనిపిస్తోంది. 2023 జూలైలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఆమె పదవీ కాలం ఈ జూలైతో ముగియనుంది. అయితే పొత్తులు కుదర్చడంలో పురందేశ్వరి సక్సెస్ అయ్యారు. దీంతో మరి కొంతకాలం పాటు ఆమెను కొనసాగించే ఛాన్స్ ఉందని ప్రచారం నడుస్తోంది.
ఏపీ బీజేపీలో చాలామంది ఆశావహులు ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఆయనకు రాష్ట్ర మంత్రివర్గంలో చాన్స్ దొరుకుతుందని అంత భావించారు. కానీ బిజెపి నుంచి సత్య కుమార్ యాదవ్ కు ఛాన్స్ దక్కింది. దీంతో రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తేనే సముచితంగా ఉంటుందని ఆశిస్తున్నారు. అందుకే ఈసారి సుజనా చౌదరి కి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.
ఇంకోవైపు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన సురేష్ రెడ్డి, సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి పేర్లు సైతం బయటకు వచ్చింది. ఆయన విషయంలో కర్ణాటక, తెలంగాణకు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కూటమిలో టిక్కెట్లు దక్కని వారికి అధ్యక్ష పదవి విషయంలో చాన్స్ ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఏపీలో కూటమి ఉన్న నేపథ్యంలో వారితో సమన్వయం చేసుకున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.