రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల సంచలన ప్రకటన చేసిన మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సంచలనానికి తెరలేపారు. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో ఆయన భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. మూడు రోజుల క్రితం ఆయన హైదరాబాద్ లోని వైఎస్ షర్మిల నివాసానికి వెళ్లి దాదాపు మూడు గంటలపాటు సమావేశమైనట్టు రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించి మధ్యాహ్న భోజనం కూడా చేశారని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
జగన్ కు, షర్మిలకు మధ్య విభేదాలు కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయి షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్దయెత్తున చర్చకు దారితీస్తున్నది. ముఖ్యంగా దీనిపై వైసీపీ నేతలు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఇదిలా ఉండగా విజయసాయి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించినప్పుడు షర్మిల ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఈ సమయంలో వీరిద్దరూ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కాగా 15 రోజుల పాటు ఇంగ్లాండ్, ప్రాన్స్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ కోర్టులో విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు అనుమతి ఇచ్చింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10వ తేదీ మధ్య విజయసాయి.. విదేశీ పర్యటన చేయనున్నారు. అయితే అసలు షర్మిళతో ఎందుకు భేటీ అయ్యారనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు.
ఆస్తుల పంపకాల విషయంలో విజయసాయిరెడ్డి జగన్ పక్షానే నిలిచారు. షర్మిళకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే జగన్, షర్మిళ మధ్య రాజీ కుదర్చడానికే వీరు భేటీ అయ్యారా? లేక షర్మిళపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల వివరణ ఇచ్చేందుకు కలిశారా అనేది అర్థం కావడం లేదు. ఇప్పటికే ఆయన రాజీనామాతో వైసీపీ క్యాడర్ లో కొంత నైరాశ్యం నెలకొంది. ఈ పరిస్థితుల్లో షర్మిళతో భేటీ కావడం వెనుక కారణం ఏమై ఉంటుందనే విషయంపై వారంతా లోతుగా ఆలోచిస్తున్నారు. దీనిని సాధారణ భేటీగా కొట్టి పారేసేందుకు నిరాకరిస్తున్నారు.