
ఇటీవల కాలంలో గంజాయి కేసులు బాగా పెరిగాయి. మత్తు పదార్థాల వినియోగం బాగా పెరిగింది. గంజాయి పట్నం నుంచి పల్లెల దాకా వ్యాపించింది. అది యువత నుంచి విద్యార్థుల వరకు వ్యాపించింది. ఇక ఏపీలో గంజాయి వినియోగం పెరిగిందని.. వైసీపీ హయాంలో దీనికి నియంత్రణ లేకుండా పోయిందని టీడీపీ బాగా విమర్శించింది. చంద్రబాబు అయితే ఏకంగా ఏపీని గంజాయి రాజధానిగా మార్చేశారని ఆరోపించారు.
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గంజాయి, డ్రగ్స్ రవాణా విషయంలో సీరియస్ గా స్పందిస్తోందని తెలుస్తోంది. ఈ విషయంలో ఎన్నిసార్లు అరెస్టైనా, ఎన్ని కేసులున్నా తీరు మార్చుకోని వారిపై కఠిన చర్యలకు ఏపీ సర్కార్ ఉపక్రమించింది. ఇది గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లపై ఉక్కుపాదం అనే చెప్పాలి!
గంజాయి, డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ రవాణాకు పాల్పడుతూ ఎన్నిసార్లు అరెస్టైనా, ఎన్ని కేసులు ఎదుర్కోంటున్నా తీరు మార్చుకోని వారి విషయంలో ఏపీ సర్కార్ సీరియస్ గా ప్లాన్ చేసింది! ఈ కేసుల్లో అరెస్టైన కొన్ని రోజులకు బెయిల్ పై బయటకు వచ్చేసి, మళ్లీ పెట్రేగిపోతున్న వారిని ఏడాదిపాటు జైల్లో నిర్భంధించాలని నిర్ణయించింది! వారిపై ప్రివెన్షన్ ఆఫ్ ఇలిసిట్ ట్రాఫిక్ ఇన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ (పిట్ ఎన్.డీ.పీ.ఎస్. చట్టం - 1988) ను ప్రయోగిస్తోంది. ఈ సమయంలో ఇప్పటికే ఇద్దరిపై ఈ చర్యలు మొదలుపెట్టింది. తొలిసారిగా విజయవాడ పోలీసు కమీషనరేట్ పరిధిలో ఇద్దరిని నిర్భంధంలోకి తీసుకున్నారు.
వీరిద్దరిపై గంజాయి స్మగ్లింగ్, అక్రమ రవాణాకు సంబంధించి అనేక కేసులున్నాయని చెబుతున్నారు. వీరిరువురూ అలాంటి కేసుల్లో అరెస్టై, జైలుకెళ్లినప్పటికీ పద్దతి మార్చుకోవడం లేదని, నేరాలు ఆపడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఈ సరికొత్త చర్యలు తీసుకుంటూ తాజాగా ఉత్తర్వ్యులిచ్చింది.
వాస్తవానికి గంజాయి, డ్రగ్స్ స్మగ్లర్లు ఎక్కువ మంది యువతే ఉంటున్నారని.. విద్యాసంస్థలే లక్ష్యంగా విక్రయాలు జరుపుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో యువత ఈ మత్తుకు అలవాటుపడి, ఆ మత్తులో దోపిడీలు, రౌడీయిజం, చైన్ స్నాచింగ్ వంటి పనులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఆయా కేసుల్లో విచారణ, శిక్షలతో సంబంధం లేకుండా.. ముందస్తు నిర్బంధంలో ఉంచితే వారి చర్యలను కట్టడి చేయొచ్చని పోలీసులు పిట్ ఎన్.డీ.పీ.ఎస్. ను ప్రయోగిస్తున్నారని అంటున్నారు.