
ఒక హత్య చేయడానికి మహిళలకు హక్కు ఉండాలని ఎలాంటి శిక్షలు ఉండకూడదనే డిమాండ్ ను ఓ మహిళా నేత తెరపైకి తెచ్చారు. మహారాష్ట్రలో శరత్ పవార్ పార్టీకి చెందిన రోహిణీ ఖడ్సే ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె లేఖ వెలుగులోకి వచ్చింది. ఇది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.
ఎన్సీపీ(ఎస్పీ) మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణి ఖడ్సే ఒక సంచలన లేఖ రాశారు. ఇందులో ఆమె దేశంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మహిళలు ఒక హత్య చేయాలని అనుకుంటున్నారని, అలా హత్య చేసిన మహిళలకు శిక్ష పడకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. ఆమె హత్య చేస్తానని చెప్పింది మనిషి కాదు. మనిషిలో ఉన్న చెడు ఆలోచనలని. అణచివేత మనస్తత్వం, అత్యాచారం చేయాలనే ఆలోచనను, అస్తవ్యస్తంగా ఉన్న శాంతిభద్రతాలను మహిళలు హత్య చేయాలనుకుంటున్నారని, వారికి శిక్ష పడకుండా చూడాలంటూ ఆమె లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల ముంబైలో ఓ 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ రోహిణి ఈ లేఖ రాశారు. మహారాష్ట్రలో శాంతి భద్రతలు అస్తవ్యస్తంగా మారాయని, మహిళలపై రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆమె విమర్శించారు. మహిళలపై దాడులు చేయాలి, వారిని అణచిపెట్టి ఉంచాలి, వారిపై అత్యాచారం చేయాలనే మనస్తత్వాలను హత్య చేసేందుకు మహిళలకు అవకాశం ఇస్తూ వారికి శిక్ష నుంచి ఇమ్యూనిటీ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో కిడ్నాప్, గృహ హింస వంటి నేరాలపై ఆమె గళం విప్పారు. అలాగే మన దేశం మహిళల భద్రతా విషయంలో సురక్షితం కాదని పలు నివేదికలు వెల్లడిస్తున్నట్లు కూడా ఆమె ఉటంకించారు. అణచివేత మనస్తత్వాన్ని, అత్యాచార ధోరణిని, శాంతిభద్రతల అసమర్థతను మేము చంపాలనుకుంటున్నాం… ఈ అంశంపై లోతుగా ఆలోచించిన తర్వాత మా డిమాండ్‌కు అంగీకరిస్తారని మేం ఆశిస్తున్నాం అని రోహిణి ఖడ్సే అన్నారు.
ఇదిలా ఉండగా రక్షణకు ఒక మనిషిని హత్య చేసేందుకు అనుమతి కోరడం కాస్త విచిత్రంగా ఉంది. అందుకే ఇది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.