
భారతీయ విద్యార్ధుల ఆలోచనలు మారుతున్నాయి. గతంలో అమెరికా, కెనడా, ఆస్ర్టేలియా వెళ్లిన విద్యార్థలు ఇప్పుడు మాత్రం నో అంటున్నారట. వీటి స్ధానంలో కొత్త ఆప్షన్స్ వెతుక్కునే పనిలో బిజీగా ఉన్నారట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్ లోనే వెల్లడించింది.
గత మూడేళ్లలో విదేశాలకు వెళ్లే విద్యార్ధుల ధోరణుల్లో వచ్చిన మార్పుల్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు. కేంద్రమంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో 7,50,365 మంది భారతీయులు విదేశాలలో చదువుతుండగా..2023లో ఈ సంఖ్య 8,92,989కి పెరిగింది. 2024లో మాత్రం ఇది 7,59,064కి పడిపోయింది. అంటే ఏకంగా 15 శాతం తగ్గిపోయింది. కెనడాలో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 2024లో ఏకంగా 41 శాతం తగ్గుదల కావడం విశేషం.
అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో చదువుకోవడానికి వెళ్లే భారతీయుల సంఖ్య కూడా తగ్గింది. అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 2023లో 2,34,473 నుండి 2024లో 204,058కి తగ్గింది. ఇది 12.9 శాతం తగ్గుదలగా నమోదైంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడయ్యాక అక్కడి విధానాల కారణంగా తలెత్తిన అనిశ్చితి దీనికి కారణమని భావిస్తున్నారు. దీని వల్ల గతేడాది చాలా మంది విద్యార్థులు అమెరికాలో చదువులపై వెనక్కి తగ్గారు.
బ్రిటన్ విషయానికొస్తే 27.7 శాతం తగ్గుదలగా నమోదైంది. కఠినమైన వీసా నిబంధనల, పోస్ట్-స్టడీ వర్క్ విధానాల వల్ల ఈ సంఖ్య తగ్గినట్లు అంచనా. ఆస్ట్రేలియాలో విద్యార్థుల సంఖ్య కూడా 12 శాతం తగ్గిపోయింది. చైనాకు ప్రయాణించే భారతీయ విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. గత మూడేళ్లలో రష్యాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ఉందని కేంద్రం వెల్లడించింది. 2022లో 19,784 మంది విద్యార్థుల నుండి, 2023లో 23,503కి, 2024లో 31,444కి విద్యార్ధుల సంఖ్య పెరిగింది. అదేవిధంగా ఫ్రాన్స్‌కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2022లో 6,406 నుండి 2023లో 7,484కి పెరిగింది. అలాగే 2024లో 8,536కి చేరుకుంది.
జర్మనీలో కూడా భారతీయ విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2023లో 23,296, 2022లో 20,684తో పోలిస్తే 2024లో 34,702 మంది విద్యార్థులు అక్కడికి వెళ్లారు. న్యూజిలాండ్‌లోనూ 2022లో 1,605 మంది విద్యార్థులతో పోలిస్తే 2024లో 7,297 మందికి పెరిగారు.