మీడియాలో ఓ అసాధారణ పరిస్థితి చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్‌తో గత నెల 21 నుంచి లాక్‌డౌన్ అమలవు తోంది. దీంతో అన్ని పరిశ్రమలూ మూతబడ్డాయి. అదేవిధంగా అన్ని కంపెనీలూ తాళం వేసుకున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా కూడా అన్ని పనులూ ఆగిపోయాయి. ప్రజలు మొత్తం తమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, ప్రజలకు వార్తలు అందించడంలో సారధిగా ఉండే మీడియా మాత్రం పనిచేయాల్సిన ఓ అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ.. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలను, వార్తలను అనుసంధానం చేస్తూ.. ప్రజలను చైతన్యం చేయడంలో మీడియా పాత్ర అనన్య సామాన్యం.
ఈ క్రమంలో లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలను కూడా అధిగమించి ప్రజా నేత్రం పత్రికలు, మీడియా కూడా పనిచేస్తున్నాయి. ఎప్పటిక ప్పుడు ప్రజలను చైతన్య పరుస్తూ.. మీడియా తన బాధ్యతలను ముందుకు నడిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎలక్ట్రానిక్ మీడి యాకు, ప్రింట్ మీడియాకు పలు సమస్యలు ఎదురయ్యాయి. ప్రస్తుతం ప్రసారాలు కొనసాగిస్తున్నప్పటికీ.. ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రకటనలు కరువయ్యాయి. దీంతో ఆదాయం తగ్గిపోయింది. నిజానికి ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో ఎప్పటి నుంచో ఎలక్ట్రానిక్ మీడియా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు కరోనా ఎఫెక్ట్‌తో కీలక వ్యాపార రంగాలు సంస్థలు కూడా మూతబడడంతో మరింత ఇబ్బందుల్లో ఉంది.
ఇక, ప్రింట్ మీడియా విషయానికి వస్తే.. ఎలక్ట్రానిక్ మీడియా మాదిరిగానే దీనికి కూడా ప్రకటనలు తగ్గిపోయాయి. ప్రభుత్వాల నుంచి కూడా ప్రకటనలు లేక పోవడం, వ్యాపార సంస్థలు మూతబడడం వంటి పరిణామాలు ప్రింట్ మీడియాను కుంగదీస్తున్నాయి. అదేసమయంలో న్యూస్ ప్రింట్(ముడి పేపర్) దిగుమతి కూడా నిలిచిపోయింది. దీంతో ప్రింట్ అవసరాలకు కీలకమైన న్యూస్ ప్రింట్ విషయంలో ఇప్పటి వరకు ఉన్న ఉత్పత్తులు మినహా కొత్తగా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు.
దీంతో ఇప్పటికే జోన్లు , జిల్లాల టాబ్లాయిడ్‌లను తగ్గించిన ప్రధాన మీడియా ఖర్చు విషయంలోనూ కోతకు రెడీ అయ్యాయి. 50 శాతం ఖర్చులు తగ్గించుకునే క్రమంలో ఉద్యోగులను కూడా తగ్గించాలని ప్రధానంగా నిర్ణయించినట్టు తెలిసింది. దీనిపై అన్ని పేపర్లదీ ఒకే మాట.. ఒకే బాట.. కావడం గమనార్హం. ఈ రోడ్లమీదకు వస్తోన్న జర్నలిస్టుల కుటుంబాల బాధలు అన్నీ ఇన్నీ కావు అన్నట్టుగా ఉంది. వీరంతా తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.