ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అని ఏపీ సీఎం జగన్ కరోనా విషయంలో కఠోరమైన నిజం ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. అయితే ఎప్పుడూ దాగుడుమూతల దండాకోర్ అన్నట్టుగా ఎప్పుడూ నిజాలు చెప్పకుండా వక్రీకరణలు అలవాటు పడ్డ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు ఏపీ సీఎం జగన్ చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ పెడార్ధాలు తీశారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్య రంగ నిపుణులు, డబ్ల్యు హెచ్ వో వంటి ప్రతిష్టాత్మక సంస్థలు, వివిధ దేశాధినేతలు అంతా చెప్పిన ఒకే ఒక్క మాట ...? కరోనా ఇప్పుడప్పుడే వదిలిపోయేది కాదని, మరికొంతకాలం కరొనతో కలిసి సహజీవనం చేయాలి అంటూ పదే పదే చెప్పారు. ఇదే విషయాన్ని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కూడా చెప్పారు. అయితే దీనిపై టీడీపీ, జనసేన నాయకులు జగన్ మాటలను తప్పు పడుతూ అనవసర రాజకీయ విమర్శలు చేసారు.
ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్ ఇలా ఎలా మాట్లాడుతారు అంటూ విమర్శలు చేశారు. దీనికి రాజకీయ వ్యాఖ్యలను జోడించి కొద్దిరోజులుగా జగన్ పై విమర్శలు చేస్తున్నారు. అయితే కరోనాతో కలిసి మనం కొంతకాలం జీవించాల్సిందే అంటూ సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఈ విషయంలో టీడీపీ జగన్ ను టార్గెట్ చేసుకుంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. లక్షల మందిని ఆసుపత్రి పాలు చేసింది. ఇంకా ఎంతమందిని బలితీసుకుంటుందో తెలియదు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ యుద్ధాల కన్నా ప్రమాదకరంగా మారింది.
ఈ కరోనా మహమ్మారి ఎప్పటికి వదులుతుందో తెలియదు. ఇంకా ఎన్ని రోజలు ఇలా ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతకాలి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నివేదికలు ఏమో, కరోనా మనతోనే ఉంటుంది, మరో రెండేళ్లు కరోనా మప్పు తప్పదు అని తేల్చాయి. వ్యాక్సిన్ వచ్చినా కరోనా నుంచి అప్పుడే బయటపడలేము అంటూ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ లేకపోవడంతో లాక్ డౌన్ విధించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ మినహా మరో దారి లేదు అని ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి. కరోనాతో మనం కలిసి బతకాల్సిందే. కాకపోతే కాస్త తెలివి కావాలి. ఉపాయమున్నోడు అపాయం నుంచి తప్పించుకుంటాడు. కాబట్టి మనం ఉపాయంతో బతకాలి. తెలివిని ఇప్పుడు మనం సంతరించుకోవాలి. రేపో ఎల్లుండో పోయే గండం కాదు. ఇది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటి వరకూ కొంత ఉపాయంతో రక్షించుకున్నాం. ఇక నుంచి ఉపాయంతో మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు'' అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అదే విషయాన్ని జగన్ చెప్పారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అదే చెప్పారు. ఇప్పుడు తెలంగాణ మంత్రి హరీష్ రావు సైతం జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తూనే కరోనాతో మనం మరికొంతకాలం పోరాడక తప్పదు అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులూ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కేవలం జగన్ ను తప్పుపడుతూ విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా ఇదే విషయాన్ని చెబుతున్న, కేవలం జగన్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తుండడం ఆ పార్టీ దిగజారుడు రాజకీయాలకు అర్ధం పడుతోంది అంటూ వైసీపీ అభిమానులు విమర్శిస్తున్నారు.