తెలుగుదేశంపార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాయలసీమ నాలుగు జిల్లాలపై చంద్రబాబునాయుడు ఆశలు వదిలేసుకున్నట్లే అర్ధమైపోతోంది. పోతిరెడ్డి పాటు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ వివాదంలో చంద్రబాబు స్టాండ్ చూసిన తర్వాత పార్టీ నేతల్లో అయోమయం నెలకొన్న మాట వాస్తవం. పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంచాలని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగు నీరందుతుంది. శ్రీశైలం ప్రాజెక్టులోని నికర జలాలు కాకుండా కేవలం వరద జలాలు మాత్రమే వాడుకుంటామంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

ఎప్పుడైతే ఏపి ప్రభుత్వం జీవోను జారీ చేసిందో వెంటనే తెలంగాణా సిఎం కేసీయార్ తో పాటు ఇతర పార్టీలు కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంటే కేసియార్ నిర్ణయానికి మిగిలిన రాజకీయపార్టీలు పూర్తి మద్దతుగా నిలబడ్డారు. తెలంగాణాలో రాజకీయపార్టీలన్నీ కేసీయార్ కు మద్దతుగా నిలబడినపుడు ఏపిలో ప్రతిపక్షాలన్నీ ఏమి చేయాలి ?  కానీ ఒక్క బిజెపి తప్ప మరే పార్టీ కూడా జగన్ కు మద్దతు ప్రకటించలేదు. కారణం ఏమిటంటే కాంగ్రెస్, జనసేన, సిపిఐకి  జగన్ అంటే ధ్వేషం.

 

పై పార్టీల్లో దేనికి కూడా రాయలసీమ కాదు కదా అసలు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క సీటు సాధించలేదు మొన్నటి ఎన్నికల్లో. కాబట్టి వాళ్ళ గురించి జనాలు ఎవరూ పట్టించుకోవటం లేదు. మరి చంద్రబాబుకు ఏమైంది ?  మొన్నటి ఎన్నికల్లో రాయలసీమలోని 52 అసెంబ్లీ సీట్లలో టిడిపికి వచ్చింది కేవలం మూడంటే మూడు మాత్రమే. ఎనిమిది పార్లమెంటు సీట్లలో కనీసం ఒక్కటి కూడా రాలేదు. బహుశా ఇందుకే చంద్రబాబు రాయలసీమ మీద ధ్వేషంతో ఉన్నట్లున్నారు.

 

మొన్నటి ఎన్నికల్లో అంటే సీట్లు రాలేదు సరే, మరి భవిష్యత్తు మాటేమిటి ?  రాజకీయ పార్టీలన్నాక గెలుపోటములు సహజమే కదా ? ఓడినా, గెలిచినా జనాల ప్రయోజనాల కోసం పోరాడేదే నిజమైన రాజకీయ పార్టీ అవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం జగన్ మీద ధ్వేషంతోనో లేకపోతే కేసీయార్ అంటే భయంతోనో పోతిరెడ్డిపాడు స్కీమ్ విషయంలో నోరెత్తటం లేదు. అంటే భవిష్యత్తులో కూడా రాయలసీమలో టిడిపికి ఒక్క సీటు కూడా రాదని చంద్రబాబు ఫిక్సయిపోయినట్లే ఉన్నాడు.

 

ఇందుకేనా పోతిరెడ్డిపాడు పై రాజకీయంగా ఇంత రాద్దాంతం జరుగుతున్నా చంద్రబాబు నోరెత్తటం లేదు. జగన్ కు మద్దతుగా మాట్లాడటం లేదంటే పరోక్షంగా కేసీయార్ కు మద్దతిస్తున్నట్లే లెక్క. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏనాడూ పనిచేయలేదు కాబట్టే పార్టీకి ఇంతటి దుస్ధితి వచ్చింది. పైగా రాయలసీమలోనే పుట్టానంటూ గతంలో పెద్ద డైలాగులే పేల్చాడు. మరి ఏమైంది రాయలసీమ మీద ప్రేమ. ఓ స్కీము ద్వారా రాయలసీమ లాభపడుతుందని ప్రభుత్వం అనుకున్నపుడు ప్రతిపక్ష నేతగా మద్దతివ్వటం కనీస ధర్మం కాదా ? అన్నింటినీ కాదని నోరెత్తకుండా కూర్చున్నాడంటే రాయలసీమలో పార్టీ భవిష్యత్తుపై ఆశలు వదిలేసుకున్నట్లే అనుమానంగా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: