జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని గుడ్డిగా వ్యతిరేకించటమే పనిగా పెట్టుకున్నాయి ప్రతిపక్షాలు. వాటికి ఎల్లోమీడియా గొంతు కలుపుతోంది. తాజాగా నిర్ధరక ఆస్తులను అమ్మేయాలని గతంలో తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్టుబోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయాలని టిటిడి తాజా నిర్ణయాన్ని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. నిర్ధరక ఆస్తుల అమ్మకం విషయంలో బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి విచిత్రమైన వాదన మొదలు పెట్టారు. 50 స్ధలాలు అమ్మితే వచ్చే రూ. 23 కోట్లు టిటిడికి అవసరమా ? అని అడగటంలోనే వాళ్ళ అజ్ఞానం బయటపడుతోంది.

 

ఇక్కడ విషయం ఎన్ని ఆస్తులమ్మితే ఎంత డబ్బులు వస్తాయన్నది కాదు. అసలు ఆ భూములను టిటిడి రక్షించగలుగుతుందా ? అన్నదే ప్రధానం. వెంకటేశ్వరస్వామి భక్తులు స్వామివారి మీద భక్తితో వాళ్ళ ఆస్తులను టిటిడికి రాసిచ్చేయటం మామూలే. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అనేక ఆస్తులు టిటిడి పరమవుతుంటాయి. అయితే వివిధ రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లోని భూములను కాపాడుకోవటం నిజంగా టిటిడికి సాధ్యంకాదన్న విషయం అందరు గ్రహించాలి.

 

స్వామి వారికి భక్తులు 100 గజాలు, 200 గజాల స్ధాలల నుండి ఎకరాల భూముల వరకూ రాసిచ్చేస్తుంటారు. ఎకరాల స్ధలాలనైనా, 100 గజాల స్ధలాలనైనా జాగ్రత్త చేసుకోవటం టిటిడికి సాధ్యంకాదు. ఎందుకంటే ఎక్కడో మూల టిటిడికి 100 గజాల స్ధలముంటే దేవస్ధానం ఎలా కాపాడుకుంటుంది ? దాతలు స్ధలమైనా భూములైన స్వామివారికి ఇచ్చేయగానే టిటిడి సదరు ఆస్తికి ఫెన్సింగ్ వేసేస్తుంది. అయితే ప్రత్యేకంగా ఈ ఒక్క ఆస్తికి ఓ అధికారిని నియమించటం సాధ్యం కాదు. కాబట్టి ఎప్పుడో సమయం, సందర్భం చూసుకుని ఆస్తుల పర్యవేక్షణకు ఓ అధికారి వస్తాడు. అప్పటికి సదరు ఆస్తి ఆక్రమణల్లో ఉంటే చేయగలిగేదేముంది ?

 

కబ్జాలను క్లియర్ చేయటానికి టిటిడి ప్రయత్నిస్తుంది. లేకపోతే కోర్టుకు వెళ్ళటం తప్ప చేయగలిగేది కూడా ఏమీ లేదు. బయట రాష్ట్రాల్లో ఉన్న ఆస్తుల పరిరక్షణకో లేకపోతే కబ్జాలు క్లియర్ చేయటానికి ఆ ప్రభుత్వాలో లేకపోతే స్ధానిక జిల్లా యంత్రాంగం కూడా సహకరిస్తుందన్న నమ్మకం కూడా లేదు. ఆస్తుల అన్యాక్రాంతంపై టిటిడి కోర్టుకెక్కుతుంది. కోర్టు కూడా టిటిడికే అనుకూలంగా తీర్పు చెబుతుంది. అయితే ఆ తీర్పును అమలు చేయాల్సిందే అక్కడి యంత్రాంగాలే అన్న విషయం మరచిపోకూడదు. స్ధానిక నేతలను కాదని లోకల్ యాంత్రాంగాలు టిటిడికి సహకరించేంది అనుమానమే.

 

అన్యాక్రాంతమైన ఆస్తులను కాపాడుకోలేకపోవటంతో పాటు కోర్టు ఖర్చుల పేరుతో మళ్ళీ లక్షలు ఖర్చు చేయాలి. ఇంత చేసినా ఆస్తులు స్వాధీనం అవుతాయన్న నమ్మకం లేదు. ఇంతోటి దానికి కోర్టులకు వెళ్ళేకన్నా బహిరంగ వేలంలో అమ్మేయటమే మేలుకదా ? బహిరంగవేలంలో  అమ్మేయగా వచ్చే డబ్బును టిటిడి ఏమి చేస్తుంది ? ఏమి చేస్తుందంటే తన ఖజానాలో జమచేసుకుని మళ్ళీ  ఏదో రూపంలో  భక్తలకే కదా ఖర్చు చేసేది.  ఇంతోటి దానికి బిజెపి నేతలు ఎందుకింత గోల చేస్తున్నారో అర్ధం కావటం లేదు. ఒకవైపు లాభాల్లో ఉన్న ఎల్ఐసి లాంటి సంస్ధలను, ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటుకు అప్పగించేస్తోంది నరేంద్రమోడి సర్కార్. మోడి సర్కార్ చేస్తున్న పని వల్ల జనాలకు నష్టమన్న విషయాన్ని బిజెపి నేతలు గుర్తిస్తే బాగుంటుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: