అవును మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగుబాబు కొట్టిన దెబ్బకు ఒకవైపు తెలుగుదేశంపార్టీ మరోవైపు ఎల్లోమీడియా అసలు నోరెత్తటం లేదు. సినిమా షూటింగుల విషయమై చర్చించేందుకు మెగాస్టార్ ఇంట్లో కొందరు సినీ పెద్దలు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో వారం క్రితం భేటి అయ్యారు. అదే విషయమై ఎన్టీయార్ జయంతి రోజున బాలకృష్ణ మాట్లాడుతూ అందరు కలిసి రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించాడు. అందరు కలిసి భూములు పంచుకుంటున్నారా ? అంటూ బాలయ్య మండిపడ్డాడు.
దాంతో చిరంజీవి సోదరుడు నాగుబాబు కూడా అంతే స్ధాయిలో రియాక్టయ్యాడు. తలసానితో రియల్ ఎస్టేట్ చేస్తున్నారనే బాలయ్య ఆరోపణలపై సమాధానమిస్తు ’ఏపిలో రియల్ ఎస్టేట్ చేసిందెవరో అందరికీ తెలుసు’ అంటూ వాయించేశాడు. రాజధాని అమరావతి పేరు చెప్పి రియల్ ఎస్టేట్ చేసిందెవరో ? నమ్మించి మోసం చేసిందెవరు అందరికీ తెలుసంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. బాలయ్య రియల్ ఎస్టేట్ మాత్రమే అని ఆరోపిస్తే నాగుబాబు డైరెక్టుగా అమరావతని రియల్ ఎస్టేట్ అంటూ హెచ్చరించటం హాట్ టాపిక్ గా మారింది.
2014లో చంద్రబాబునాయుడు సిఎం అయిన తర్వాత అమరావతి ప్రాంతాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, టిడిపిలోని కొందరు కీలక నేతలు, బాలకృష్ణ వియ్యంకుడు అండ్ కో చాలామందే వందల ఎకరాలు కొనేశారు. వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల లాభపడిన వాళ్ళు లాభపడితే అమ్మిన రైతులు బాగా నష్టపోయారు. దీన్ని జగన్మోహన్ రెడ్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ చెప్పింది.
ఈ విషయాన్నే నాగుబాబు డైరెక్టుగా ప్రస్తావించాడు. నాగుబాబు డైరెక్టుగా ప్రస్తావించిన అమరావతి రియల్ ఎస్టేట్ వ్యవహారంపై సినీ ప్రముఖులు కానీ టిడిపి నేతలు కానీ ఎవరు ఎందుకు ఖండించలేదు ? మామూలుగా ప్రత్యర్ధులపై ఒంటెత్తున లేచే టిడిపి నేతల్లో ఒక్కళ్ళు కూడా నాగుబాబు మాటలను ఖండించటానికి ఇష్టపడటం లేదు. అంటే నాగాబాబు చెప్పిన మాటలు కరెక్టని అంగీకరిస్తున్నట్లే కదా ? పోనీ మిగితావాళ్ళు రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదనే అనుకుందాం ? మరి బాలయ్య కూడా ఎందుకు నోరెత్తటం లేదు ?
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబుకు సన్నిహితులుగా ఉండే సినీప్రముఖులు మురళీమోహన్, అశ్వనీదత్ లాంటి వాళ్ళు కూడా అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారు. అలాగే కొందరు మీడియా అధిపతులకు కూడా భూములున్నాయని ప్రచారం. ఇవన్నీ అందరికీ తెలిసిన రహస్యాలే. అందుకనే టిడిపిలో కానీ ఎల్లో మీడియాలో కానీ ఎవరు నోరెత్తటం లేదు.