అవును తాజాగా నారావారి పుత్రరత్నం లోకేష్ చెప్పిన మాటలను బట్టి అందరికీ అదే అర్ధమవుతోంది. దాదాపు 80 రోజుల లాక్ డౌన్ తర్వాత మొదటిసారిగా మీడియా సమావేశం పెట్టాడు. ముందుగా రాసుకొచ్చిన నోట్సును అప్పగించేసిన లోకేష్ మధ్యలో ఓ మాట చెప్పాడు. ఇంగ్లీషుమీడియం ఏర్పాటు గురించి మాట్లాడుతూ తాను ’ఇంగ్లీషుమీడియంలో చదవుకోవటం వల్లే తనకు తెలుగు మాట్లాడటం సరిగా రాద’ని చెప్పాడు. నిజానికి తాను చెప్పిన మాటలకు లోకేష్ సిగ్గుపడాలి. ఎందుకంటే ఇంగ్లీషుమీడియంలో చదవినంత మాత్రాన తెలుగు సరిగా మాట్లాడకపోవటం అన్న సమస్యే రాదు. మాతృభాష తెలుగు అయ్యుండి తెలుగు సరిగా మాట్లాడలేకపోవటం లోకేష్ లోపమంతే.
లోకేష్ తో పాటు కొన్ని లక్షల మంది ఇంగ్లీషులోనే చదువుకుంటున్నారు. వారంతా తెలుగు మాట్లాడటంలో ఇబ్బందులు పడుతున్నారా ? తనలోని లోపాన్ని సమర్ధించుకునేందుకు లోకేష్ ఏవో కతలు చెప్పాడన్న విషయం అర్ధమైపోతోంది. సరిగా మాట్లాడలేకపోవటం అన్నది లోకేష్ లో మొదటి నుండి ఉన్న లోపం. దానికి ఇంగ్లీషుమీడియం, తెలుగు మీడియం అని సొల్లు కబుర్లెందుకు ? అప్పట్లో అంటే లోకేష్ చిన్నపుడు ఏ మీడియంలో చదవాలనే విషయం తెలిసుండదు. అందులోను చంద్రబాబునాయుడు కూడా పుత్రరత్నాన్ని ఇంగ్లీషు మీడియంలోనే చేర్పించాడు కాబట్టే ఇపుడు తెలుగు మాట్లాడటం సరిగా రావటం లేదంటున్నాడు.
తాను చెప్పిందే నిజమైతే మరి అప్పట్లో చంద్రబాబు చేసిన తప్పును ఇపుడు లోకేష్ ఎందుకు చేస్తున్నాడు. తన కొడుకు దేవాన్ష్ ను ఇంగ్లీషుమీడియంలో కాకుండా తెలుగు మీడియంలో చేర్పిస్తే ఎవరైనా అడ్డుకున్నారా ? దేవాన్ష్ ను తెలుగుమీడియంలో చేర్పించి తెలుగు భాషతో పాటు ఇంగ్లీషు కూడా బాగా మాట్లాడేటట్లు ట్రైనింగ్ ఇప్పించచ్చు కదా ? ఆపని చేయకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టాలని అనుకుంటున్న ఇంగ్లీషుమీడియంపై అక్కసెందుకు ?
సరే ఈ విషయాలను పక్కనపెట్టేసినా ఇంగ్లీషు మీడియంలో చదవకపోవటం వల్లే తాము ఉన్నత చదువుల విషయంలో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బందులు పడుతున్నామంటూ వేలాది మంది చెబుతున్న మాటలు లోకేష్ కు అర్ధమవుతున్నాయా ? తెలుగుమీడియంలో చదివినా మహా అయితే 10వ తరగతి వరకే తెలుగుంటుంది. అంటే ఇంటర్మీడియట్ తర్వాత చెప్పేది, చదివేదంతా ఇంగ్లీషుమీడియంలోనే కాదా. కాబట్టి పరీక్షలు రాయాల్సింది కూడా ఇంగ్లీషులోనే. అందుకనే పేదల పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకునే ఇంగ్లీషుమీడియంను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.
ఫిన్లాండ్ లాంటి దేశాల్లో మాతృభాషలోనే చదువుకోవాలని సొల్లు చెబుతున్న లోకేష్ తన కొడుకును మాత్రం ఇంగ్లీషుమీడియంలో ఎందుకు చేర్పించలేదో సమాధానం చెబుతాడా ? అంటే తన కొడుకు మాత్రం ఇంగ్లీషుమీడియంలో చదువుకోవాలి, పేదల పిల్లల మాత్రం తెలుగులో మాత్రమే చదవాలా ? ఇటువంటి మాటలు మాట్లాడితేనే జనాలు నవ్వుకుంటున్నారన్న విషయాన్ని ఎంత తొందరగా లోకేష్ గ్రహిస్తే అంత మంచిది.