రాజ్యసభ ఎన్నికలు ముగిసాయి. అందరూ అనుకున్నట్లుగానే టిడిపి తరపున పోటి చేసిన వర్ల రామయ్య ఓడిపోయాడు. వైసిపి అభ్యర్ధులకుకేటాయించిన ఓట్లకన్నా ఎక్కువే పడటంతో ఘన విజయం సాధించారు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడే అసలు విషయం మరుగునపడిపోయి కొసరు విషయంపైనే టిడిపిలో వివాదం రాజుకుంటోంది. గెలుపు అవకాశం లేదని తెలిసే వర్లను చంద్రబాబునాయుడు పోటికి దింపిన విషయం అందరికీ తెలిసిందే.
ముగ్గురు తిరుగుబాటు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం టిడిపికి అనుకూలంగా ఓట్లేయరన్న విషయం ఊహించిందే. దానికి తగ్గట్లే తమ ఓట్లను ఇన్ వాలీడ్ అయ్యేట్లు చేసుకున్నారు. మరి ఇన్ వాలీడ్ అయిన నాలుగో ఓటు విషయం మాటేమిటి ? అన్నదే పార్టీలో ఇపుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఇన్ వాలీడ్ అయిన నాలుగో ఓటు ఆదిరెడ్డి భవానీదనే విషయం బయటపడిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. తన ఓటును సక్రమంగా భవానీ ఎందుకు వేయలేకపోయింది ? అనే విషయంలో భిన్న వాదనలు వినబడుతున్నాయి.
భవానీ ఉన్నత విద్యావంతురాలు. బిజినెస్ మ్యానేజ్మెంట్లో మాస్టర్ డిగ్రీ చదివింది. పైగా మొదటి నుండి రాజకీయ నేపధ్యమున్న కుటుంబమే. తన ఓటు ఎలా వేయాలో తెలీని మనిషైతే కాదు. ఇవన్నీ పక్కనపెట్టినా ఎంఎల్ఏల సౌలభ్యం కోసమే రాజ్యసభ ఎన్నికల్లో ఓటింగ్ ఎలా చేయాలనే విషయంలో టిడిపి మాక్ పోలింగ్ (శిక్షణ) కూడా నిర్వహించింది. ఇంత జరిగిన తర్వాత కూడా భవానీ ఓటు ఎందుకు ఇన్ వాలీడ్ అయ్యింది ? ఎందుకంటే ఉద్దేశ్యపూర్వకంగానే భవాని తన ఓటును ఇన్ వాలీడ్ చేసిందనే ప్రచారం పెరిగిపోతోంది.
ఇఎస్ఐ కుంభకోణంలో తన బాబాయ్ కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో చంద్రబాబునాయుడుపై ఆమెకు బాగా కోపంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సూత్రధారులు హ్యాపీగా ఉన్నా పాత్రధారుడైన తన బాబాయ్ ను ఏసిబి అధికారులు అరెస్టు చేయటంతో ఆమె భగ్గున మండిపోతోందట. భవాని మండిపోతోందంటే ఆమె ఒక్కర్తే అనుకునేందుకు లేదు. ఎందుకంటే స్వయాన ఆమె సోదరుడే శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు. పార్టీలో జరుగుతున్న చర్చ చూస్తుంటే కింజరాపు కుంటుంబం చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లే అనుకోవాలి.
రాజ్యసభ ఎన్నికలకు ముందే ముగ్గురు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం అసంతృప్తి బయటపడింది. కాబట్టి వాళ్ళ ఓట్లు టిడిపికి పడవనేది అర్ధమైపోయింది. అయితే భవాని అసంతృప్తి ఎక్కడా బయటపడలేదని పార్టీ వర్గాలంటున్నాయి. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వచ్చిన అవకాశాన్ని భవాని ఇన్ వాలీడ్ ఓటుతో బయటపెట్టారని అనుకుంటున్నారు. ఇదే నిజమైతే పార్టీకి ప్రమాధం ముంచుకొస్తున్నట్లే అనుకోవాలి. చూద్దాం ఏమి జరుగుతుందో.