మరోసారి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డి వైఖరిపై చర్చ మొదలైంది. ఇద్దరు కూడా తమ మద్దతుదారులకు హామీ ఇస్తే దాదాపు నెరవేర్చటానికే ప్రయత్నిస్తారు. తాజాగా ఎంఎల్సీ పదవులను ఎంపిక చేసిన ఇద్దరిని చూస్తే అందరికీ అర్ధమైపోతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంకు చెందిన మాజీ ఎంపి పండుల రవీంద్రబాబు, కడప జిల్లాలోని రాయచోటి నియోజకవర్గానికి చెందిన జకియా ఖాతూన్ ను ఎంపిక చేశాడు. నిజానికి ప్రస్తుత అవసరాల రీత్యా వీళ్ళద్దరినీ ఎంపిక చేయకపోయినా జగన్ను అడిగేవాళ్ళే లేరు. కానీ జగన్ మాత్రం వీళ్ళనే ఎంపిక చేశాడంటే అందుకు కారణం కచ్చచితంగా ఉందన్న విషయం అర్ధమవుతోంది.
ఇంతకీ వీళ్ళని ఎందుకు ఎంపిక చేశాడంటే పండుల రవీంద్రబాబు మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు అమలాపురం ఎంపిగా టిడిపికి రాజీనామా చేసి వైసిపిలో చేరాడు. అప్పట్లో టికెట్ హామీ ఇవ్వకపోయినా రవీంద్ర పార్టీలో చేరాడు. అవకాశం ఉంటే టికెట్ ఇస్తానని లేకపోతే ఏదో ఓ విధంగా సర్దుబాటు చేస్తానని జగన్ హామీ ఇచ్చాడు. అయితే పార్టీలో మొదటి నుండి పనిచేస్తున్న నేతలకే టికెట్ ఇవ్వాలని అనుకున్న జగన్ అనుకున్నట్లే పార్టీలో పనిచేస్తున్న చింతా అనూరాధకు అమలాపురం ఎంపిగా టికెట్ ఇచ్చాడు. ఈ కారణంగా రవీంద్రకు టికెట్ ఇవ్వలేకపోయాడు. సరే ఎంపిగా ఎలాగూ అవకాశం రాలేదు కాబట్టి కనీసం విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట ఎంఎల్ఏగా అయినా పోటి చేసే అవకాశం ఇవ్వమని రవీంద్ర అడిగినట్లు సమాచారం. కానీ కుదరలేదు.
ఇక జకియా ఖాతూన్ విషయం తీసుకుంటే ఈమె భర్త రాయచోటి మార్కెట్ కమిటి మాజీ ఛైర్మన్ అఫ్జల్ ఆలీఖాన్. అవకాశం వస్తే శాసనమండలి సభ్యత్వం ఇస్తానని ఆలీఖాన్ కు ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ హామీ ఇచ్చాడు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసిపి అఖండ మెజారిటితో గెలిచింది. తర్వాత కొద్ది రోజులకే ఆలీఖాన్ మరణించాడు. తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో ఇపుడు రెండు స్ధానాలు ఖాళీ అయ్యాయి. దాంతో ఆలీఖాన్ కు హామీ ఇచ్చినట్లుగానే ఇపుడు ఆయన భార్య జకియా ఖానూన్ కు ఎంఎల్సీగా అవకాశం ఇచ్చాడు. నిజానికి హామీ పొందిన ఆలీఖాన్ లేడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఎంఎల్సీగా ఇవ్వకపోయినా జగన్ను అడిగేవారు లేరు. అలాగే రవీంద్రకు కూడా ఎంఎల్సీగా అవకాశం ఇవ్వకపోయినా అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఆ విషయం తెలిసి కూడా జగన్ ఇద్దరికీ ఎంఎల్సీలుగా అవకాశం ఇచ్చాడన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఇక్కడే చంద్రబాబునాయుడుకు పోలిక అనివార్యమైంది. అవసరానికి చంద్రబాబు ఎంతమందికైనా హామీలిచ్చేస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఎంఎల్సీ పోస్టు కానీండి, ఎంఎల్ఏ టికెట్ కానీండి ఒకేసారి పదిమందికి కూడా హామీలివ్వగలిగిన దిట్ట ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. చివరకు టికెట్ ఇవ్వాల్సొచ్చినపుడు తాను హామీ ఇచ్చిన పదిమందికి కాకుండా పదకొండో వ్యక్తికి ఎవరికో టికెట్ ఇచ్చేస్తాడు. అంటే చంద్రబాబు టికెట్ ఖాయం చేసేటపుడు తన అవసరాలు మాత్రమే చూసుకుంటాడు కానీ పార్టీకి లాయల్ గా ఉన్నారా లేదా ? అవసరమైనపుడల్లా పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారా లేదా ? అన్న విషయాలను ఏమాత్రం పట్టించుకోడని చాలాసార్లే రుజువైంది. అందుకనే చంద్రబాబు మద్దతుదారులు ఎప్పటికప్పుడు మారిపోతుంటారనే ప్రచారం పార్టీలోనే జరుగుతోంది.