తెలంగాణ మంత్రులపై నిఘా నీడ కొనసాగుతోందా..? అంటే అవుననే అంటున్నాయి టీఆర్ ఎస్ వర్గాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా జిల్లాల్లో మంత్రులు వ్యవహరిస్తున్న తీరును తెలుసుకునేందుకు కొంతమంది గ్రామ, మండల, జిల్లాస్థాయి నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరు తెలుసుకోవడంతో పాటు ప్రజాసంబంధాలను, పార్టీ కార్యక్రమాలను, జిల్లా యంత్రాంగాన్ని ముందుకు నడిపించే తీరు వంటి వాటిని పరిగణలోకి తీసుకుంటూ మంత్రుల పనితీరుకు మార్కులు వేస్తున్నట్లు సమాచారం. అవసరమైన సమయంలో ప్రశంసలు..లేదంటే వేటు వేసేందుకు కూడా కేసీఆర్ వెనకాడబోరన్నది టీఆర్ ఎస్ పార్టీ ముఖ్య నేతల నుంచి వినిపిస్తున్న మాట.
వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల్లోనే సీఎం కేసీఆర్ ఇలాంటి విషయాలన్నింటిపై స్పష్టత ఇవ్వడం గమనార్హం. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై కచ్చితంగా పరిశీలన చేస్తామని, చీమచిటుక్కుమన్నా తెలిసిపోతుందని హెచ్చరికలు జారీచేశారు. అప్పటికే జిల్లాల్లో తిరుగుతూ పనిచేస్తున్న కొద్దిమంది మంత్రులను మెచ్చుకున్నారు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పనితీరుపై మూడంచెల్లో వివరాల సేకరణ జోరుగా సాగుతోంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో గ్రామస్థాయిలో ఏ మేరకు ప్రజలకు అందుబాటులో ఉన్నారో వివరాలన్నీ సీఎంకు చేరుతున్నాయి.
కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు సొంతంగా ఖర్చు పెట్టుకుని పని చేసినా మరికొంతమంది వ్యాపారుల నుంచి వసూలు చేసి కూడా పేదలకు సాయం చేయలేదనే ఆరోపణలున్నాయి. ఈ విషయం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో ఇప్పుడు మంత్రుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. ఈ విషయం తెలుసుకున్న మంత్రులు అలర్ట్ అయ్యారు. అదే సమయంలో తమపై సీసీ కెమెరాలు వెంటాడుతున్నాయ్ అంటూ తమ ముఖ్య అనుచరుల వద్ద వాపోతున్నారని సమాచారం. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకుంటూ వెళ్లడంతో పాటు వారితో ఎంతో అన్యోన్యంగా ఉంటుండటం గమనార్హం. దక్షిణ తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులకు ఇటీవల ఓ స్ట్రాంగ్ వార్నింగ్ కేసీఆర్ నుంచి వెళ్లినట్లు సమాచారం. కరోనా విషయంలో జిల్లాలో ఆయన వ్యవహరిస్తున్న తీరుపై కేసీఆర్ మండిపడ్డారంట.